సాక్షి, హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా ముఖ్యంగా మహిళల అక్రమ రవాణాను నిరోధించడంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడం లేదంటూ స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలపై కౌంటరు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బొసాలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం 1956లోని నిబంధనలను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని, చట్టాలను కఠినంగా అమలు చేసి అక్రమ రవాణాను అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని కూడా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది.
చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల రోజు రోజుకు మహిళల అక్రమ రవాణా పెరిగిపోతోందని, చిన్నారులపై లైంగిక దాడులు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి కేసులను పరిష్కరించే కింది కోర్టులకు, అధికారులకు బాధితుల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకునేలా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
మనుషుల అక్రమ రవాణాపై హైకోర్టులో పిల్
Published Sat, Apr 4 2015 1:29 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement