► సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించిన పీయుష్ గోయల్
న్యూఢిల్లీ: సింగరేణి క్వారీల్లో పనిచేస్తున్న సుమారు 25 వేలమంది కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం, బోనస్, కుటుంబానికి వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సంస్థ సీఎండీ శ్రీధర్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆదేశించారు. కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర నేతలు గోవర్ధన్‌రెడ్డి, బాలరాజ్, కీర్తిరెడ్డి తదితరులు బుధవారం కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు.
కాంట్రాక్టు కార్మికులు ఏళ్లుగా పనిచేస్తున్నా వారికి కనీస వేతనం అమలు చేయడం లేదని, బోనస్ అందడం లేదని, వైద్య సదుపాయంకూడా కార్మికులకు మాత్రమే అమలు చేస్తున్నారని, వారి కుటుంబ సభ్యులకు అమలు చేయడం లేదని కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి సింగరేణి సీఎండీ శ్రీధర్‌తో ఫోన్లో మాట్లాడి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని, బోనస్, ఇతర వైద్య సదుపాయాలను కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి తీసుకున్న చొరవపై రాష్ట్ర బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టడం లేదు..
రాష్ట్రంలో కనీస వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మణ్ మండిపడ్డారు. కనీస వేతనం అమలు చేయాలన్న హైపవర్ కమిటీ సిఫార్సులను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కు వ్యతిరేకం అని చెప్పిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు భూపాలపల్లిలో జనావాసాల మధ్య ఓపెన్‌కాస్ట్ మైనింగ్ చేపట్టేందుకు పూనుకుందని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌కు తగిన సమయంలో కార్మిక లోకం బుద్ధి చెబుతుందని ఆయన హెచ్చరించారు.