మన జిల్లా.. మన ప్రణాళిక..ఆమోదం | plan ready for coming five years development | Sakshi
Sakshi News home page

మన జిల్లా.. మన ప్రణాళిక..ఆమోదం

Published Tue, Jul 29 2014 1:01 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

plan ready for coming five years development

ఆదిలాబాద్ అర్బన్/ఆదిలాబాద్ టౌన్ :  ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక ఆమోదం పొందింది. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రూ.10,240 కోట్లతో ప్రణాళికకు ఆమోదముద్ర వేశారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్ పర్సన్ శోభారాణి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6 గంటల వరకు సాదాసీదాగా సాగింది. ఈనెల 13వ తేదీ నుంచి 18 వరకు గ్రామస్థాయిలో, 18వ తేదీ నుంచి 23 వరకు మండల స్థాయిలో, 23వ తేదీ నుంచి 27 వరకు జిల్లాస్థాయిలో జరిగిన ప్రణాళికలు సర్వసభ్య సమావేశంలో ఆమోదం తెలుపుతున్నట్లు చైర్ పర్సన్ శోభారాణి పేర్కొన్నారు.

 అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి.. : స్వామిగౌడ్, రామన్న
 ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అటవీశాఖ మంత్రి జోగు రామన్నలు మాట్లాడుతూ జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఈ ప్రణాళికలు దోహదపడతాయని, ప్రణాళికలో చేర్చిన అంశాలతోపాటు దృష్టికి రాని అంశాలు కూడా చేర్చి అభివృద్ధి సాధించేలా ప్రణాళిక ఉండాలని వారు పేర్కొన్నారు. తమ వంతుగా రాష్ట్రం నుంచి జిల్లాకు నిధులు రప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చైల్డ్ కేర్ మొబైల్ వ్యాన్‌ను అంగన్‌వాడీల పిల్లల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని, కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, జిల్లాను రెండో కాశ్మీర్‌గా తీర్చిదిద్దాలని, ఉద్యోగులతో ప్రజాప్రతినిధులు స్నేహభావంగా పనులు చేయించుకోవాలని వారు సూచించారు.

 జిల్లా ప్రణాళిక
 ‘మన ఊరు.. మన ప్రణాళిక..’ కింద రూ.10,240 కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. ఇందులో గ్రామపంచాయతీ ప్రణాళిక కింద రూ.3,020 కోట్లు, మండల ప్రణాళిక కింద రూ.4,606, జిల్లా ప్రణాళిక కింద రూ.2,613 కోట్లుగా చేర్చారు. జిల్లాస్థాయి సమస్యలు గుర్తించి ఆయా నియోజకవర్గాల పరిధిలో 1,060 పనులకు సంబంధించి రూ.4,606 కోట్ల ప్రణాళికగా రూపొందించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 46 పనులకు రూ.1,149 కోట్లు, ఆసిఫాబాద్‌లో 117 పనులకు రూ.997 కోట్లు, బెల్లంపల్లిలో 72 పనులకు రూ.213 కోట్లు, బోథ్‌లో 296కు రూ.439 కోట్లు, చెన్నూర్‌లో 61కు రూ.138 కోట్లు, ఖానాపూర్‌లో 136కు రూ.1027 కోట్లు, మంచిర్యాలలో 33కు రూ.94 కోట్లు, ముథోల్‌లో 54కు రూ.227 కోట్లు, నిర్మల్‌లో 151కు రూ.163 కోట్లు, సిర్పూర్-టిలో 94కు రూ.155 కోట్లతో జిల్లా ప్రణాళికలో చేర్చారు.

 ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలు
 ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన సమస్యలను చేర్చడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా సీసీ రోడ్లు, తారు రోడ్లు, కొత్త రోడ్ల నిర్మాణాలకు రూ.167 కోట్ల పనులు చేర్చారు. విద్యాశాఖ ద్వారా జిల్లాలో సైన్స్ మ్యూజియం, ఓరియంటేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు రూ.15 కోట్లతో చేర్చారు. రూ.47 కోట్లతో 42 కొత్త జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలో ఉంది.

నీటి పారుదల శాఖ ద్వారా బ్రిడ్జిలు, చెక్‌డ్యాంలు నిర్మించడానికి రూ.43 కోట్లు ప్రణాళికలో చేర్చారు. గ్రామీణ నీటి సరఫరా ద్వారా 8 ప్రాజెక్టు పనులకు రూ.434 కోట్లు, వైద్యారోగ్య శాఖ ద్వారా పౌష్టికాహారం, చిన్నపిల్లల ఆరోగ్యం, రక్తనిధి కేంద్రాలు, కొత్త శిక్షణ కేంద్రాలకు 19 పనులకు రూ.352 కోట్లు, విద్యుత్ శాఖకు సంబంధించి 76 పనులకు రూ.343 కోట్లు ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా జిల్లా క్రీడాభివృద్ధి కోసం రూ.33 కోట్లు, రోడ్డు భవనాల శాఖ ద్వారా 99 పనులకు  రూ.1,175 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు.

 సభా దృష్టికి సమస్యలు
 ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు సర్వసభ్య సమావేశంలో ఆయా నియోజకవర్గ, జిల్లా, మండలాల సమస్యలను సభాదృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను ప్రణాళికలో చేర్చి అమలు చేయాలని కోరారు. మొదటగా ఎంపీలు సమస్యలు తెలుపగా, అనంతరం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు వారివారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను సభలో లేవనెత్తారు. ఈ సమస్యలను ప్రణాళికలో చేర్చడంతోపాటు ఆమోదించేలా చూడాలని మంత్రి, జెడ్పీ చైర్మన్‌కు సభ్యులు విన్నవించారు.

సమస్యలు ఎక్కువవుతున్న తరుణంలో రాతపూర్వకంగా కూడా అందజేయవచ్చని, ఇందుకు రెండు రోజుల సమయం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. విన్నవించిన సమస్యలను కూడా ప్రణాళికలో చేర్చి వాటికి నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తామని జెడ్పీ చైర్ పర్సన్ శోభారాణి పేర్కొన్నారు. శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న తాగునీరు, మరుగుదొడ్లు, రోడ్ల నిర్మాణాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ సమస్యలను సభా దృష్టికి తెచ్చారు.

 ప్రజాప్రతినిధులకు సన్మానం
 శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, వెంకట్రావ్‌లను జెడ్పీ చైర్ పర్సన్ శోభారాణి, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, ఉద్యోగులు పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వైద్యారోగ్య శాఖ ద్వారా నిర్వహిస్తున్న డయేరియా, అతిసార నివారణ పక్షోత్సవాల సందర్భంగా ప్రభుత్వం నుంచి వచ్చిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ జగన్‌మోహన్, ‘మన ఊరు.. మన ప్రణాళిక..’ ప్రత్యేక అధికారి అశోక్, ఎంపీలు నగేష్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, వెంకట్రావ్, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement