వ్యాపారులకు నోటీసులు అందజేస్తున్న పంచాయతీ సిబ్బంది
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్): పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు అధికారుల చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయింది. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరిస్తే తప్ప ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేలా లేదు. ఎక్కడ చూసిన విరివిగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. ప్లాస్టిక్ మట్టిలో కలిసే పదార్థం కాదు. దీంతో పర్యావరణంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి.
ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వ్యాపారులు, వినియోగదారులు పట్టించుకోవడంలేదు. విచలవిడి వినియోగంతో మానవాళి మనుగడకు పెనుముప్పుగా మరిందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేనా?
పెద్దశంకరంపేట మేజర్ పంచాయతీలో ప్లాస్టిక్ వినియోగం పై నిషేధిస్తున్నట్లు గత ఏడాది సెప్టెంబర్‌లో అధికారులు దుకాణాల యజమానులకు నోటీసులు అందజేశారు. ఇందుకు సహకరించాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని నోటీసులో పేర్కొన్నారు. తొమ్మిది నెలలు దాటినా ప్రజలు, వ్యాపారులు ఈ విషయంపై స్పందించడం లేదు.
వ్యాపారులు యథేచ్ఛగా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్నారు. ఫాలిథిన్ కవర్ల వినియోగంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముందుగా కవర్ల వాడకాన్ని నిషేధిస్తు జ్యూట్ బ్యాగులు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. మార్కెట్‌లో ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగించని బ్యాగుల వినియోగం పెంచాలి. వ్యాపారులను హెచ్చరించడంతో పాటు బ్యాగులు అందుబాటులో ఉండేలా చూస్తే ఫాలిథిన్ కవర్ల వినియోగాన్ని అరికట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్లాస్టిక్ నిషేధంపై నోటీసులు అందజేశాం
పేటలో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై వ్యాపారులు, దుకాణాల యజమానులకు గతంలోనే నోటీసులు అందజేశాం. ప్రజలు, వ్యాపారులు సహకరించాలి. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషిచేయాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
– నర్సింహాగౌడ్, ఈఓ, పెద్దశంకరంపేట
Comments
Please login to add a commentAdd a comment