ఖాకీ చేతికి తుపాకీ
కామారెడ్డి: గత నాలుగైదేళ్లుగా లాఠీతో కనిపించిన పోలీసన్న ఇక తుపాకీతో దర్శనమివ్వనున్నాడు. రాష్ట్రంలో ఉగ్రవాదులు పోలీసులను టార్గెట్‌గా చేసుకుని దాడులు చేసిన దరిమిలా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగా పోలీసుల చేతిలో తుపాకీ ఉండాలన్న నిర్ణయానికి వచ్చిన ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి పోలీసు స్టేషన్లకు తుపాకులను సరఫరా చేశారు. జిల్లాలో 42 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇందులో గత కొన్నేళ్లుగా ఎలాంటి ఆయుధాలు లేవు.
వీఐపీల పర్యటనలు, పండుగలు, భారీ హింసాత్మక సంఘటనలు జరిగినపుడు ప్రత్యేక పోలీ సు బలగాలు ఆయుధాలతో ఆయా ప్రాంతాలకు చేరుకునేవి. స్థానిక పోలీసులు మాత్రం లాఠీలతోనే దర్శనమిచ్చేవారు. ఇటీవల నల్గొండ జిల్లాలో ఉగ్రవాదులు పోలీసులను టార్గెట్‌గా చేసుకుని జరిపిన దాడుల నేపథ్యంలో ప్రభుత్వం పోలీసుల చేతిలో ఆయుధాలు ఉండాలన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో ఆయా జిల్లాల పోలీసు అధికారులు అన్ని ఠాణాలకు ఆయుధాలను అందించారు.
ఇక సాయుధులు
పోలీసులకు ఆయుధం రక్షణగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఎక్కడికి వెళ్లినా సాయుధులుగానే వెళ్లాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయుధం లేకుండా ఎక్కడికి వెళ్లే పరిస్థితి ఉండదు. వాహనాల తనిఖీల సమయంలోనైనా, వీఐపీల పర్యటనల సందర్భంలో భద్రతా చర్యలకు వెళ్లినపుడైనా, ఎక్కడికైనా సరే ఆయుధాలు ధరించి వెళ్లాల్సిందే. మొన్నటి నల్గొండ సంఘటనల సందర్భంలో పోలీసుల చేతిలో ఆయుధాలుండి ఉంటే వారి ప్రాణాలు పోయేవి కావన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవడం, ఉగ్రవాదులు మరిన్ని దాడులు జరపవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికల నేపత్యంలో ప్రభుత్వం పోలీసులకు ఆయుధాలను సమకూర్చింది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
పోలీసుస్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా పోలీసు యంత్రాం గం క్విక్ రియాక్షన్ టీంలు, బ్లూకోట్ టీంలు, షీ టీములను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందినే ఎంపిక చేసి ఆయా బృందాలలో చేర్చారు. దీంతో ఠాణాలలో అవసరమైన మేర సిబ్బంది లేకుండాపోయారని ఓ పోలీసు అధికారి అభిప్రాయ పడ్డారు. వీఐపీల పర్యటనలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో బందోబస్తు నిర్వహించడానికి కూడా సిబ్బంది సరిపోవడం లేదని అంటున్నారు. ఉన్న కొద్దిమంది తోనే పనులు చేయించాల్సి వస్తోందని, తద్వారా ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు.