నవదీప్ గెస్ట్‌హౌస్‌పై పోలీసుల దాడి
అక్రమ మద్యం పట్టివేత, ఒకరి అరెస్టు
మోమిన్‌పేట: సినీహీరో నవదీప్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా వినియోగిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం చక్రంపల్లిలో ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకొంది. ఎక్సైజ్ సీఐ అశోక్, లా అండ్ ఆర్డర్ ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం.. చక్రంపల్లిలోని ధరణి వెంచర్స్‌లో హీరో నవదీప్ ఎకరం భూమి కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. శుక్రవారం రాత్రి ఆయన కుటుంబీకులు, స్నేహితులు దాదాపు 30 మంది అందులో విందు చేసుకున్నారు.
విదేశీ మద్యం వినియోగిస్తున్నారనే సమాచారంతో మర్పల్లి ఎక్సైజ్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజు సిబ్బందితో దాడులు చేశారు. అక్కడ ఉన్న 26 కింగ్‌ఫిషర్ బీర్లు, అబ్సలూట్ వోడ్కా బాటిల్ ఒకటి, జానీవాకర్ బ్లాక్‌లేబుల్, బాకాడి బ్లాక్ రమ్, బ్లూ రిబైన్డ్ జిన్‌లు ఒక్కోటి చొప్పున స్వాధీనం చేసుకున్నారు. విందులో మద్యం వినియోగించేందుకు అనుమతి తీసుకోలేదని సీఐ తెలిపారు. గెస్ట్‌హౌస్ నిర్వాహకుడు సాయి సూర్యనారాయణరాజును అదుపులోకి తీసుకొని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దీంతోపాటు ధరణి వెంచర్ యజమానిపైనా కేసు పెట్టి విచారణ జరుపుతున్నామన్నారు.
భవనాలకు అనుమతి లేదు..
ధరణి వెంచర్‌లో భవనాల నిర్మాణానికి అనుమతులు లేవని చక్రంపల్లి గ్రామ కార్యదర్శి మల్లేశ్ పేర్కొన్నారు. ఎన్‌వోసీ మాత్రమే ఇచ్చామన్నారు. అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్ విషయంలో ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.