
సాక్షి, నల్లగొండ: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన రైతు పాదయాత్రకు బ్రేక్ పడింది. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందిదని.. ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఈనెల 26 నుంచి బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తామని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్ర అనుమతి కోసం డీజీపీ, ఎస్పీకి కోమటిరెడ్డి దరఖాస్తులు చేసుకున్నారు. కానీ పోలీసులు పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. దీంతో పాదయాత్రకు బ్రేక్‌పడినట్లైంది. అయితే ప్రాజెక్టు సాధనకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు.
అనుమతివ్వలేమని నోటీసులు..
బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు సాధన పాదయాత్రకు సంబంధించి అనుమతి కోసం కోమటిరెడ్డి ఈనెల 19న డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 23న ఎస్పీకి కూడా లేఖ రాశారు. జాతీయ రహదారి వెంట పాదయాత్ర చేస్తున్నందున భద్రత కల్పిస్తూ అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు మాత్రం పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ నోటీసులు జారీ చేశారు. జాతీయ రహదారి అయినందున నిత్యం రద్దీగా ఉంటుందని, గణేశ్ నవరాత్రులను పురస్కరించుకుని పోలీసులంతా బందోబస్తు దృష్ట్యా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందని, హైదరాబాద్ నుంచి విగ్రహాలు నల్లగొండ, ఇతర ప్రాంతాలకు వస్తాయని, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిత్యం వాహనాల రద్దీ ఉంటుందని.. జాతీయ రహదారి అంతా రద్దీగా ఉంటోందని, గతంలో రహదారిపై జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ ఎస్పీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం హక్కులను హరిస్తోందన్న కోమటిరెడ్డి
ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తుందంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్తూనే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాదయాత్రను అణచివేయాలని చూడడం సరి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న నల్లగొండ జిల్లా ప్రాజెక్టుపై మాత్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని విమర్శించారు. తాను శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తానని పోలీసులకు దరఖాస్తు చేసుకున్నా అనుమతివ్వకపోవడం స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని.. హైకోర్టు నుండి అనుమతి తీసుకొచ్చి ప్రాజెక్టు సాధన కోసం రైతు పాదయాత్ర చేసి తీరతానని స్పష్టం చేశారు.
పాదయాత్రకు అనుమతి ఇవ్వలేం
నల్లగొండ క్రైం: ఈనెల 26 నుండి 29 వరకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేపట్టే ఉదయ సముద్రం – బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన రైతు పాదయాత్రకు అనుమతించడం లేదని ఎస్పీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి సందర్భంగా సున్నిత ప్రాంతాల్లో ప్రజలు ప్రశాంతంగా ప్రజలు పండుగను జరుపుకునేందుకు తగిన బందోబస్తు కల్పించాల్సి ఉంటుందని, జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉంటుందని, వినాయక విగ్రహాలను హైదరాబాద్ నుంచి తీసుకెళ్తూ ఉంటారని తెలిపారు. నవరాత్రుల సందర్భంగా వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. నిత్యం 40వేల వాహనాలు జాతీయ రహదారిపై వెళ్తున్నట్లు టోల్‌గేట్‌లో నమోదైన రికార్డు తెలుపుతోందని వెల్లడించారు.
‘పాదయాత్రకు మార్గం సుగమం–ప్రజాపోరుకు సిద్ధం కండి’ అంటూ పోస్టర్‌ను విడుదల చేయడంతో కొందరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టినట్లు వివరించారు. ఈనెల 26న అధిక వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 5 నుంచి 10 మందితో పాదయాత్ర చేసేందుకు వినతిపత్రం ఇస్తే సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. కోమటిరెడ్డి గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినట్లు పోలీస్ రికార్డు ఉందని వెల్లడించారు. 2014లో ఎన్నికల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, 2015లో ఎస్‌ఎల్‌బీసీకి అనుమతి లేకుండా బైక్ ర్యాలీ తీశారని, 2018లో వీటీ కాలనీ నుంచి బైక్‌ర్యాలీ, చర్లపల్లి నుంచి క్లాక్ టవర్ వరకు అనుమతి లేకుండా బైక్ ర్యాలీ తీసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఎస్పీ తెలిపారు.