తెలంగాణ-ఛత్తీస్‌గఢ్,ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు..
భద్రాచలం: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్,ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ముమ్మరమయ్యాయి. సమాచార వ్యవస్థను విధ్వంసం చేయటమే లక్ష్యంగా మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నట్లుగా చర్ల మండలం సత్యనారాయణపురం ఘటన రుజువు చేస్తోంది. మావోల కార్యకలాపాలకు అడుకట్ట వేసేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చర్ల మండలం దోశిలపల్లి వద్ద ఇటీవల పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గిరిజనుడు మృతిచెందాడు.
దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి విధ్వంసాలకు పాల్పడకుండా ఆదివారం రాత్రి నుంచే డివిజన్‌లోని అన్ని స్టేషన్‌ల పరిధిలో పోలీసు తనిఖీలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే భద్రాచలం పట్టణ సమీపంలోని కూనవరం రోడ్‌లో పట్టణ ఎస్సై మురళీ తన సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీ చేసి అందులో ప్రయాణిస్తున్న అనుమానిత వ్యక్తుల వివరాలతో పాటు బ్యాగులను సోదా చేశారు.ద్విచక్రవాహనాలు, వివిధ ప్రైవేటు వాహనాలపై వచ్చే వారి వివరాలను తెలుసుకున్న తరువాతే పట్టణంలోకి అనుమతించారు. మావోయిస్టుల బంద్, చర్లలో జరిగిన ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లుగా ఎస్సై మురళి తెలిపారు. బంద్ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్, సరిహద్దున ఉన్న మారుమూల ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.
సమాచార వ్యవస్థ ధ్వంసమే లక్ష్యమా?
నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో సమాచార వ్యవస్థను ధ్వంసం చేయడమే లక్ష్యంగా మావోయిస్టులు వ్యూహ రచన చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సెల్‌టవర్‌ను కాల్చివేయటం గతంలో కూడా పలు చోట్ల జరిగింది. భద్రాచలం (ప్రస్తుతం నెల్లిపాక మండలం) మండలంలోని గన్నవరం, దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి వద్ద ఉన్న సెల్‌టవర్‌లను మావోలు తగులబెట్టారు.
తాజాగా చర్ల మండలం సత్యనారాయణపురం వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను పేల్చివేసేందుకు మావోయిస్టులు సిద్ధమయ్యారు. పోలీసులు అప్రమత్తతతో తిప్పికొట్టారు. రూ. 25 లక్షల విలువైన ఆస్తిని కాపాడగలిగారు. ఇటీవలికాలంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో ఆయా సెల్‌టవర్‌ల వద్ద పోలీసులు కాపలా కోసమని తగిన బందోబస్తును ఏర్పాటు చేశారు.