కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఈ మేరకు గత మార్చి నుంచి ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేశారు. ఒకరిని అరెస్టు చేసి, 59 మందికి నోటీసులు జారీ చేశారు. ఇక చార్జిషీట్లు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రముఖులు వైరస్ బారిన పడినట్లుగా, ఓ ఆస్పత్రి పేరు తెలుపుతూ సిబ్బంది మొత్తానికి కోవిడ్ వచ్చిందని వదంతులు సృష్టించగా..బాధిత వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఇలా అందిని అన్ని ఫిర్యాదులను సైబర్‌క్రైమ్ పోలీసులు పరిశీలించి చర్యలకు ఉపక్రమించారు.
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ కట్టడికి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ నేపథ్యంలో సోషల్ మీడియా కేంద్రంగా వదంతులు సృష్టించిన వారిపై కఠిన చర్యలకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మార్చి 23 నుంచి గత వారం వరకు సైబర్ స్పేస్ పోలీసింగ్ నిర్వహించిన ప్రత్యేక బృందాలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షికార్లు చేసి, ప్రజలకు తప్పుదోవ పట్టించి, భయభ్రాంతులకు గురి చేసిన వదంతులను గుర్తించారు. పోలీసులే నేరుగా 21 కేసుల్ని సుమోటోగా నమోదు చేయగా.. మరో మూడింటిని బాధితుల ఫిర్యాదుతో రిజిస్టర్ చేశారు.
(ఆ 9 దేశాలు కరోనాను జయించాయి )
సుమోటోగా కేసులు..
కాచిగూడకు చెందిన ఓ ఆస్పత్రిలో అనేక మందికి కోవిడ్ సోకిందని, నగరానికి చెందిన ఓ చోటా నాయకుడు ఈ వైరస్ బారినపడ్డాడని వచ్చిన వదంతులపై నమోదైన రెండు కేసులు తాజావి అని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో స్వైర విహారం చేస్తున్న వదంతులను కట్టడి చేయడానికి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ స్పేస్ పోలీసులు నిర్వహిస్తున్నారు. వివిధ రకాలైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న వదంతులను గుర్తిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా, లేదంటే సుమోటోగా కేసులు రిజిస్టర్ చేయడం ప్రారంభించారు. దీనికోసం ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు.
లాక్‌డౌన్ ఎఫెక్ట్ : రికార్డు అమ్మకాలు)
అత్యధికం భయపెట్టేవే..
కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి వివిధ రకాలైన ఆడియోలు, వీడియో క్లిప్స్, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. వీటిలో కొన్ని సమాచారం పంచే విధంగా, ప్రజల్లో ముందు జాగ్రత్తలపై అవగాహన పెంచేలా ఉంటుండగా.. అత్యధికం భయపెట్టే సమాచారం, నిర్ధారణ కాని అంశాలు పొందుపరిచి ఉంటున్నాయి. వీటి వల్ల ప్రజలు తీవ్రస్థాయిలో భయభ్రాంతులకు గురికావడంతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదమూ ఉంది. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన రెండో రోజు నుంచే సిటీ సైబర్ క్రై మ్ పోలీసులు సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపట్టారు. గతంలో ఓ ప్రముఖ వ్యక్తి వాయిస్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న వాయిస్ క్లిప్ వీరి దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించిన ఆ ప్రముఖ వ్యక్తిని సంప్రదించిన అధికారులు దాంతో ఆయనకు సంబంధం లేదని, ఎవరో క్రియేట్ చేసినట్లు తేల్చారు. దీని ఆధారంగా సుమోటో కేసు నమోదు చేశారు.
సిటీ సీపీ వాయిస్ క్లిప్ అంటూ..
మరో ప్రముఖ ఆస్పత్రి డాక్టర్, విలేకరి మధ్య సంభాషణ అంటూ వచ్చిన ఆడియో క్లిప్‌పై ఆ ఆస్పత్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మరోపక్క ఇదే స్థాయిలో వైరల్ అయిన డాక్టర్ దంపతుల మరణం, కరోనా వైరస్‌కు డాక్టర్ గుప్తా మందు, రోడ్లపై పడిఉన్న దేహాలు, డాక్టర్ నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన, కోవిడ్– 19పేరుతో మార్కెట్ లోకి వచ్చిన మందు తదితర వీడియో, ఆడియోలపై కేసులు పెట్టారు. ఓ దశలో ఏకంగా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వాయిస్ అంటూ వచ్చిన ఓ వాయిస్ క్లిప్‌ను అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఇవి వైరల్ అవుతున్న గ్రూపుల అడ్మిన్‌లను ప్రశ్నించడం ద్వారా మూలాలు గుర్తించారు. తీవ్రమైన వ్యవహారానికి పాల్పడిన ఓ యువకుడిని అరెస్టు చేశారు. (పీఎన్‌బీ : మూడు ఆడి కార్లు, విమర్శలు)
పోస్ట్ చేసినా.. షేర్ చేసినా..
మొత్తం 24 కేసుల్లో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు 59 మందిని నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఎ) కింద నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు అన్ని కేసుల్లోనూ నిందితులపై న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించారు. దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ సన్నాహాలు ప్రారంభించారు. ఈ పోస్టుల్ని షేర్ చేసిన, ఇతర కామెంట్స్ పెట్టిన వారితో పాటు మరికొందరినీ గుర్తించిన అధికారులు వారికి నోటీసులు జారీ చేస్తూ వారు వినియోగించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటి ఆధారంగా అభియోగపత్రాలు దాఖలు చేయడానికి నిర్ణయించారు. ఇప్పటికీ నగరంలో సైబర్ స్పేస్ పోలీసింగ్ కొనసాగుతోందని, ఏ సమాచారం అయినా పూర్తిగా నిర్థారించుకోకుండా ప్రచారం, షేరింగ్ చేయవద్దని అలా చేస్తే చట్ట ప్రకారం ఏడాది వరకు జైలు శిక్షకు ఆస్కారం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. వదంతులు పోస్టు చేసిన వారితో పాటు వాటిని షేర్ చేసినా, కామెంట్స్ పెట్టినా నిందితులే అవుతారని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment