
కాంగ్రెస్ మహా ధర్నాలో స్వల్ప లాఠీచార్జ్
వరంగల్: ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా, నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం వరంగల్ కార్పొరేషన్ వద్ద చేపట్టిన మహాధర్నాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి, నాయకులను మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. సమగ్ర సర్వే, సంక్షేమ పథకాలు అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు.