
పోలీసుశాఖ ఆధునీకరణ: నాయిని
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖ ఆధునీకరణ కోసం చరిత్రలో ఎవరూ తీసుకోని సాహసోపేత నిర్ణయాలను సీఎం కేసీఆర్ తీసుకున్నారని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రధాన కార్యాలయ నియంత్రణ వ్యవస్థకు అనుసంధానమై పనిచేసే వాహనాలను పోలీసు శాఖకు సమకూర్చుతున్నామన్నారు.
జిల్లాల్లోని ప్రతి పోలీసుస్టేషన్‌కు వాహనాలను సమకూర్చడంలో భాగంగా తాజా గా 290 సుమోలు, 260 బొలెరోలు, 15 ఇన్నోవాలు కలిపి మొత్తం 565 వాహనాలను పంపిస్తున్నామన్నారు. ఈ కొత్త వాహనాల శ్రేణిని ఆదివారం ఆయన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలసి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభించారు. కొత్త వాహనాల్లో పోలీసులు గస్తీ తిరుగుతుండడం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడిందని నాయిని అన్నారు.
పోలీసుస్టేషన్ల నిర్వహణ కోసం ఇకపై ఎవరి నుంచీ నయా పైసా అడగాల్సిన అవసరం పోలీసులకు ఉండదన్నారు. పోలీసు స్టేషన్లలో నిర్భ య కేంద్రాలు, మహిళా హెల్ప్ డెస్క్‌ల నిర్వహణ కోసం రూ.26 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని మహమూద్ అలీ కొనియాడారు. కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, అదనపు డీజీ సుదీప్ లక్టాకియా, సీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సలీం పాల్గొన్నారు.