- నక్సల్స్ కార్యకలాపాల సంగతేంటి?
- విచారణ చేసి నివేదిక ఇవ్వండి
- పోలీసులకు జిల్లా ఎస్పీ ఆదేశం
- మావోయిస్టు, సానుభూతి పరుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
కరీంనగర్ :
'జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటం, నక్సల్స్ ప్రభావం లేకుండా చూడటం... ఇవే నా అత్యంత ప్రాధాన్యత అంశాలు'. ఈ నెల 8న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో జోయల్ డేవిస్ చేసిన వ్యాఖ్యలివి.
పై వ్యాఖ్యలను పరిశీలిస్తే జిల్లాలో అడుగుపెట్టడానికి ముందే పోలీస్ బాస్ తన ప్రాధాన్యతలేమిటనే దానిపై కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే వచ్చీ రాగానే జిల్లాలో నక్సల్స్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు చెందిన వారిలో ఎవరెవరు మావోయిస్టు, జనశక్తి, ఇతర విప్లవ సంస్థల్లో పనిచేస్తున్నారు? వారికి ఎవరెవరు సహకారం అందిస్తున్నారు? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. దీంతోపాటు ప్రధానంగా గతంలో మావోయిస్టు, జనశక్తి గ్రూపుల్లో పనిచేసి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సలైట్లపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలో ఎంతమంది మాజీ నక్సలైట్లు ఉన్నారు? వారు ఏయే విప్లవ సంస్థలకు చెందిన వారు? వారిప్పుడు ఏం చేస్తున్నారు? అందులో సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తున్న వాళ్లున్నారా? ఉంటే ఎందరున్నారు? మాజీ నక్సలైట్లలో ఎంతమంది మావోయిస్టులతో ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పైన పేర్కొన్న అంశాలపై లోతుగా విచారణ జరిపి నివేదిక అందజేయాలని కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఐడీ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఎస్పీ ఆదేశాల మేరకు నిఘా అధికారులు లోతు గా విచారణ ప్రారంభించారు. 2000 నుంచి 2014 వరకు పీపుల్స్‌వార్, ప్రజాప్రతిఘటన, జనశక్తి, మావోయిస్టు సహా మొత్తం 11 విప్లవ సంస్థల్లో వివిధ హోదా ల్లో పనిచేసి లొంగిపోయిన వారు ఎంతమంది ఉన్నారనే దానిపై జాబితా సేకరించారు. నాటి నుంచి గత ఏడాది వరకు జిల్లాలో దాదాపు 750 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసినట్లు గుర్తించారు. ఇందు లో దళ కమిటీ సభ్యుడు మొదలు జిల్లా, జోనల్ కమి టీ సభ్యులు, దళ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుల వరకు వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్లూ ఉన్నారు. ఈ మేరకు ఫోన్ నంబర్లు, అడ్రస్‌ల ఆధారంగా వారి నివాస ప్రాంతాలకు వెళ్లి రోజువారీ కార్యకలాపాలపై ఆరా తీసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీ సుల విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జరిపిన విచారణలో కొందరు సెటిల్‌మెంట్లు, భూకబ్జా దందాలు కొనసాగిస్తుంటే... మరికొందరు మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అలాగే తీవ్రవాద కార్యకలాపాలకు దూరం గా ఉంటూ తమ కాళ్లపై తాము నిలబడుతూ కుటుం బాలను పోషిస్తున్న వాళ్లూ కూడా ఉన్నట్టు తెలుస్తోం ది. మొత్తమ్మీద వారం, పది రోజుల్లో విచారణ పూర్తి చేసి పోలీస్ బాస్‌కు నివేదిక అందించే పనిలో పడ్డారు.
మావోయిస్టులెందరున్నారు?
ప్రస్తుతం మావోయిస్టు నాయకుల్లో జిల్లాకు చెందిన వారెందరున్నారు? వారు ఏయే హోదాల్లో ఉన్నారు? ఇప్పటికీ జిల్లా ప్రజలతో సంబంధాలున్న వారున్నారా? తదితర అంశాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులను జిల్లా బాస్ ఆదేశించినట్లు తెలిసింది. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలోని తూర్పు ప్రాంతంలో మావోయిస్టులతోపాటు వారి సానుభూతిపరుల కదలికలపై కన్నేసి ఉంచాలని సూచించినట్లు సమాచారం.