టార్గెట్ స్టూడెంట్స్!
వర్సిటీ విద్యార్థులపై మావోయిస్టుల కన్ను
ఉద్యమంలోకి ఆక ర్షించే యత్నాలు
చాపకింద నీరులా పార్టీ సంస్థాగత నిర్మాణం
విద్యావంతులను చేర్చుకుంటున్నట్లు నిఘా వర్గాల హెచ్చరిక
అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం
కరీంనగర్: మావోయిస్టులు చాపకింద నీరులా ఉద్యమాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఏ మాత్రం లేని ప్రాంతాల్లో యువకులను ఉద్యమంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిఘా వర్గాల వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత కూడా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపు లేనేలేవు. కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతంలో నామమాత్రంగా, ఖమ్మం జిల్లా చింతూరు ప్రాంతంలో (ఛత్తీస్‌గఢ్ సరిహద్దు) తప్ప ఎక్కడా వారి కదలికలు లేవు. అయితే పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉద్యమంలోకి విద్యావంతులను ఆకర్షించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన ఉత్తర తెలంగాణ పోలీసులు కాలేజీల్లో చదువుకుంటూ అదృశ్యమైన యువకుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచిఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వారి విచారణలో వెల్లడైంది. ‘విశ్వవిద్యాలయాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై మనం నిఘా వేయాలి. ఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి’ అని ఇటీవల శాంతిభద్రతలపై సమీక్షలో ఓ ఎస్పీ పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యమంలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులతోపాటు, పరిస్థితుల ప్రభావంతో లొంగిపోయిన మాజీలను కూడా తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు.
హరిభూషణ్ రాకతో...
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఎన్నికైనప్పటి నుంచి సంస్థాగత నిర్మాణం జోరందుకున్నట్లు తెలుస్తోంది. దళిత, గిరిజన, బలహీన వర్గాలనే కాకుండా మేధావులు, విద్యావంతులను ఆకర్షించాలని భావిస్తున్న మావోయిస్టు అగ్రనేతలు ఆ దిశగా ప్రయత్నాలను తీవ్రం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వర్షాకాలంలో దట్టంగా మారే అడవులను అనుకూలంగా మార్చుకుని ప్రజా దర్బారులు నిర్వహించాలని, పలు సంచనాలతో తమ ఉనికి చాటుకోవాలని మావోయిస్టులు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటి నుంచే రాజకీయ నేతలు, పోలీసు అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఇప్పటినుంచే సేకరిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోని అన్ని పోలీస్‌స్టేషన్ల సిబ్బందిని సర్కారు అప్రమత్తం చేసింది. రాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌ను కూడా పోలీసులు విస్తృతం చేశారు. మావోయిస్టుల దాడులను ఎదుర్కొనడం, ఆయుధాల వినియోగంపైనా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.