ఆ పోలీసు రూటు... సపరేటు! | Police Root Sapa rate in Nalgonda | Sakshi
Sakshi News home page

ఆ పోలీసు రూటు... సపరేటు!

Published Mon, Aug 11 2014 1:56 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

ఆ పోలీసు రూటు... సపరేటు! - Sakshi

ఆ పోలీసు రూటు... సపరేటు!

 సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఆ పోలీసు అధికారి అంటే చాలు, తుంగతుర్తి ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఏ చిన్న తగాదా జరిగినా, ఏదో రకంగా తెలుసుకుని ఇరువర్గాల నుంచి వసూలు చేయడం నేర్చుకున్న ఆయన తీరుకు జడిసి పోలీస్‌స్టేషన్ల గడప తొక్కాలంటే భయపడిపోతున్నారు. అన్ని అక్రమ వ్యాపారాలకు అండగా ఉంటూ సొమ్ము చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 నాటుసారా తయారీ ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బెల్లం వినియోగమూ అధికమే. ఇంకే, వరంగల్ జిల్లాకు చెందిన తన సమీప బంధువు హోల్‌సేల్ బెల్లం వ్యాపారిగా అవతారం ఎత్తగా, ఈ అధికారి బెల్లం లారీలకు ఎస్కార్టు కల్పిస్తున్నారు. ఎక్కడా వాహనాన్ని ఆపకుండా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని పోలీసులను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నా యి. దీంతో ఈ ప్రాంతంలో బెల్లం వ్యాపారంపై వీరిదే గుత్తాధిపత్యం. తిరుమలగిరిలో ఇటీవల ఓ వ్యాపారి బెల్లం దుకాణం తెరవాలని ప్రయత్నిస్తే ‘ఎట్లెట్ల బెల్లం అమ్ముతవో చూస్తా ’.. అని బెదిరించి మరీ దుకాణం తెరవకుండా చేశాడని సమాచారం. నిత్యం జిల్లాలోని పలుప్రాంతాలగుండా వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతానికి బెల్లం లారీలు తిరగడం, ఇబ్బడి ముబ్బడిగా బెల్లం క్రయవిక్రయాలు జరగడం ఈ పోలీసు అధికారి పుణ్యమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
 ఇసుకాసురులకూ.. అండాదండా
 మూసీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక దందాకు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్న ఈ అధికారి ఇప్పటికే కావాల్సినంత వెనకేశాడని సమాచారం. ఇక, ఇక్కడ ఉంటే లాభం లేదని ఆయకట్టు ప్రాంతానికి బదిలీ చేయించుకునే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మూసీనది నుంచి తవ్వేస్తున్న వందలాది లారీల ఇసుక జిల్లా సరిహద్దులు దాటుతోంది. ఇలా, తన సరిహద్దులు దాటించినందుకు భారీగానే వ సూలు చేస్తున్నాడన్న అభియోగం ఉంది. గతంలో కొందరు పోలీసులు ఏకంగా ఇసుక రవాణాకు లారీలను పెట్టిన ఉదంతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. తానేం తక్కువ తినలేదన్న రీతిలో ఈ అధికారి అక్రమ ఇసుక వ్యాపారాన్ని బాగానే ప్రోత్సహిస్తున్నారు.
 
 అన్నింట్లోనూ వేలు దూరుస్తూ..
 సివిల్ తగాదాల్లో తలదూర్చడమే కాదు, స్టేషన్లలో పనిచేసే సిబ్బందిలో ఒకరిద్దరిని తన ఏజెంట్లుగా పెట్టుకుని ప్రతి తగాదాలో వేలు పెట్టి డబ్బు గుంజుతున్నారని కొందరు బాధితులు లబోదిబోంటున్నారు. ప్రధానంగా అర్వపల్లి స్టేషన్‌లో ఈ అధికారి ఏజెంటు ఒకరు నిందితులకే కాదు, ఫిర్యాదుదారులకు కూడా చుక్కలు చూపిస్తున్నాడని, సదరు అధికారి పూర్తిస్థాయి మద్దతు ఈయనకు ఉండడంతో పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతల అండదండలు పుష్కలంగా ఉన్న సదరు అధికారి, ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకర్గాలకే బదిలీ చేయించుకునే పనిలో పడినట్లు సమాచారం. కేవలం డబ్బు సంపాదనే కాకుండా, కొన్ని అనైతిక చర్యల్లో పాల్గొంటున్న సదరు అధికారి తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్న ఈ ప్రాంత ప్రజలు రకరకాలుగా చ ర్చించుకుంటున్నారు. ఇంత బహిరంగంగా ఆ అధికారి వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతుంటే ఉన్నతాధికారులకు ఇవేవీ కనిపించకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement