ఆకాశంలో సగం.. చట్టసభల్లో అంతంతే..
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: మహిళా శక్తికి ఆమె ప్రతిరూపంగా నిలిచారు. జిల్లాలోని 14 అసెంబ్లీ సె గ్మెంట్లు... రెండు పార్లమెంటరీ స్థానాలుండగా.. గత ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల నుంచి పోటీచేసింది ఒకే ఒక మహిళ కావడం విశేషం. అయినా ఆమే విజేతగా నిలిచారు. దేశ చరిత్రలోనే తొలి మహిళా హోంమంత్రి గా రికార్డు సృష్టించారు. పట్టణ, గ్రామాల మేలు కల యికతో కూడిన జిల్లా రాజకీయరంగంలో మహిళల స్థానం అత్తెసరే. కేవలం ఒకరిద్దరు నేతలు మినహా.. కొత్తవారెవ్వరూ రాజకీయ ఆరంగేట్రానికిఆసక్తి చూపడంలేదు.
ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లో ఉన్న ఆ ఒకరిద్దరు కూడా.. అనివార్యంగా రాజకీయాల్లో చేరినవారే కావడం గమనార్హం. రాష్ట్ర రాజధానిని అనుకొని ఉన్న జిల్లాలో సహజంగానే రాజకీయ చైతన్యం ఎక్కువ. కానీ అతివలు మాత్రం ఈ దారిని ఎంచుకునేందుకు ఇష్టపడడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల నేపథ్యంలో పలువురు మిహ ళలు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నప్పటికీ చట్టసభల విషయంలో అలా జరగడం లేదు. పలు ప్రధాన పార్టీలు కూడా మహిళలకు రిజర్వేషన్లపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప.. వారికి పార్టీ టిక్కెట్లు కేటాయించడంలో విఫలమౌతుండడంతోనే మహిళల ప్రాతినిథ్యం తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇలా మొదలైంది..
2000 సంవత్సరంలో భర్త హఠాన్మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి అప్పట్లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి గెలుపొందిన ఆమెకు హోంశాఖ దక్కింది. జాతీయ స్థాయిలో తొలి మహిళా హోం మంత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వచ్చే ఎన్నికల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన సునీతా మహేందర్‌రెడ్డి కూడా భర్త ప్రోద్బలంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పదవీకాలం ముగిసిన తర్వాత ఇంటికి పరిమితమైన ఆమె తాజాగా మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో పాలుపంచుకుంటున్నారు. జెడ్పీటీసీగా ఆమె మళ్లీ బరిలో దిగారు.
వీరు ఇరువురు తప్ప.. జిల్లాలో ఉన్నతస్థాయిలో రా జకీయ పదవులు చేపట్టినవారు లేరంటే అతిశయోక్తి లేదు. గతంలో మంత్రులుగా పనిచేసిన ఉమా వెంకట్రాంరెడ్డి, కొండ్రు పుష్పలీల ప్రస్తుతం మునుపటి తరహాలో క్రియాశీలకంగా లేరు. మరో నెలరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల్లోనూ అతి వల సంఖ్య ఇద్దరికి మించి లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లా నుంచి చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించిన మహిళలు నలుగురే. వీరిలో సబితారెడ్డితోపాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పనిచేసిన సుమిత్రాదేవి, పుష్పలీల, మేడ్చల్ నుంచి ప్రాతినిద్యం వహిం చిన ఉమావెంకట్రామిరెడ్డి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మహిళా చైతన్యం ప్రతిబింబిస్తోంది. 50శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తుండడంతో అనివార్యంగా బరిలో దిగుతున్నారు.