మహా గరళ నగరం
గ్రేటర్‌లో చెరువులపై కాలుష్య పంజా
జలం.. హాలాహలం.. ప్రస్తుతం గ్రేటర్ చుట్టుపక్కల ఉన్న చెరువులు, నాలాలను చూస్తే గుర్తొచ్చే మాట ఇదే. కాలుష్యకారక పరిశ్రమలు వదిలిపెడుతోన్న ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలతో నాలాలు, చెరువులు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారీ ఈ జలాశయాలకు సమీపంలో ఉన్న శివారు ప్రాంతాలను కాలుష్య మేఘాలు కమ్మేస్తున్నాయి. ఆయా చెరువుల్లో ఆక్సిజన్ శాతం సున్నాకు పడిపోవడంతో అందులోని వృక్ష, జంతు ప్లవకాలతోపాటు స్థానికుల మనుగడా ప్రశ్నార్థకమవుతోంది.
– సాక్షి, హైదరాబాద్
‘గరళ’ చెరువుల్లో మచ్చుకు కొన్ని..
కుత్బుల్లాపూర్: ఫాక్స్‌సాగర్
(జీడిమెట్ల), వెన్నలగడ్డ–ఎన్నాచెరువు, సూరారం–కట్టమైసమ్మ, గాజులరామారం–పరికిచెర్వు,
ప్రగతినగర్–అంబీర్‌చెర్వు
కూకట్‌పల్లి: ఐడీఎల్, మైసమ్మ, ముల్లకత్వ, సున్నం చెరువులు
శేరిలింగంపల్లి: దుర్గంచెర్వు, మల్కం, పెద్దచెర్వు, గోపి, గంగారం, కాయిదమ్మకుంట, పటేల్, ఈర్ల చెర్వులు
రాజేంద్రనగర్: నూర్‌మహ్మద్‌కుంట
పాతనగరం: మీరాలం, బాలాపూర్, గుర్రం చెర్వులు
పరిశ్రమల ఆగడాలివీ..
► గ్రేటర్‌కు ఆనుకుని సుమారు 1,500 బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇతర రసాయనిక పరిశ్రమలు కొలువుదీరాయి. ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు(ఎంఈఈ), ఆర్‌వోలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం.
► గాఢత అధికంగా ఉన్న వ్యర్థ జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా.. పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు.
► ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమలు గాలికొదిలేశాయి.
► ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.
►మల్లాపూర్, ఉప్పల్, కాటేదాన్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, దుండిగల్, పటాన్‌చెరు, పాశమైలారం, బొంతపల్లి తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమలు గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నాయి.
► మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రమ్ముల్లో నింపి శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్ చేస్తున్నారు. దీనికి ఒక్కో డ్రమ్ముకు రూ.100 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు.
► ఇంకొందరు పరిశ్రమల ప్రాంగణంలోనే గోతులు తీసి వ్యర్థాలను పారబోస్తున్నారు. అక్రమ వ్యవహారం బయటికి కనిపించకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరూ అటువైపు రాకుండా 24 గంటల పాటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం.
► వ్యర్థాల డంపింగ్‌తో కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బొల్లారం తదితర పారిశ్రామిక వాడలు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమ య్యాయి. ఆయా ప్రాంతాల్లో నీటి నమూనాల్ని పీసీబీ ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భార లోహాలు మోతాదుకు మించి ఉన్నట్లుగా తేలింది.
► గతంలో ఎన్‌జీఆర్ జరిపిన సర్వేలోనూ బాలానగర్ పరిసర ప్రాంతాల్లోని మట్టిలో ప్రమాదకర భార లోహాలు ఉన్నట్లుగా వెల్లడైంది.
వంద చెరువుల్లో విష రసాయనాలు..
గ్రేటర్ పరిధిలో మొత్తం 185 చెరువులుండగా.. కూకట్‌పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కాటేదాన్, ఉప్పల్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లోని సుమారు వంద చెరువుల్లోకి యధేచ్ఛగా పారిశ్రామిక వ్యర్థాలు చేరుతున్నాయి. మహానగరం పరిధిలో సుమారు 1,540 కాలుష్యకారక బల్క్‌డ్రగ్, ఫార్మా, కెమికల్స్, ఎలక్ట్రోప్లేటింగ్ తదితర పరిశ్రమల్లో నిత్యం వెలువడుతోన్న ఘన, ద్రవ వ్యర్థాలను ప్రధాన చెరువులు, 1,500 కి.మీ. మేర ప్రవహిస్తోన్న నాలాలతోపాటు మూసీలోకి ప్రవేశిస్తున్న నాలాల్లోకి వదిలిపెడుతున్నారు.
తాజాగా కూకట్‌పల్లి ప్రాంతంలో పలు కాలనీలు, బస్తీలను తెల్లటి నురుగు కమ్మేయడం ఈ కాలుష్య పంజాకు పరాకాష్ట. పారిశ్రామికవాడలకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాల్లో పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థాలను భారీ కంటెయినర్లలో తరలించి నాలాల్లోకి వదిలిపెడుతున్నారు. జీడిమెట్ల, బాలానగర్, ఖాజిపల్లి, బొంతపల్లి, కుత్బుల్లాపూర్, పాశమైలారం, కాటేదాన్, మల్లాపూర్ తదితర పారిశ్రామికవాడల్లో కాలుష్యకారక పరిశ్రమలు వెదజల్లుతోన్న ఘన, ద్రవ వ్యర్థాలు చెరువులు, నాలాలు, మూసీని కాలుష్యంతో ముంచేస్తున్నాయి. దీంతో ఆయా చెరువుల్లో ఆక్సిజన్ శాతం దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రసాయనాలు కలసి రంగు మారిపోయిన చెరువు నీళ్లు తాకితే చాలు ఆయా ప్రాంతాల వాసులు చర్మ, శ్వాసకోశ రోగాల బారిన పడుతున్నారు. అయితే చెరువులు, నాలాల్లోకి ప్రవేశిస్తున్న వ్యర్థాలను కట్టడి చేయడంలో జీహెచ్‌ఎంసీ, పీసీబీ, పరిశ్రమల శాఖ చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
కాలుష్యంతో రోగాలపాలు..
♦ కాలుష్య కారక పరిశ్రమల నుంచి ఫినాయిల్ కాంపౌండ్లు, కాడ్మియం, లెడ్, జింక్, ఖనిజ నూనె, సల్ఫేట్లు, ఫ్లోరైడ్, పాదరసం, ఆర్సనిక్, సీసం, క్రోమియం, మిగులు క్లోరిన్ వంటి రసాయనాలు వెలువడుతున్నాయి.
♦ ప్రధానంగా ఫినాల్, క్లోరో ఫినాల్స్, పారాఫిన్ హైడ్రోకార్బన్లతో ఆయా జలాశయాల నీటి రంగు, వాసన పూర్తిగా మారుతోంది. ఈ నీటిని తాకినవారు చర్మ, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.
♦ క్రోమేట్లు, బెరీలియం, సెలీనియం, క్యాడ్మియం, ఆర్థో పాస్పరస్ చీడల మందులు, పీవీసీ, రేడియో యాక్టివ్ న్యూక్లయిడ్లు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి.
♦ పారిశ్రామిక వ్యర్థ జలాల్లో ఉన్న సల్ఫేట్లు, ఫ్లోరైడ్, కాల్షియం, మెగ్నీషియం మోతాదు శ్రుతిమించుతోంది. ఈ నీటి ద్వారా నిమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింతదగ్గు, కళ్ల మంటలు, జలుబు, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, చర్మంపై దద్దుర్లు, చర్మం నల్లగా మారడం, దురద వంటి సమస్యలతో స్థానికులు సతమతమవుతున్నారు.
♦ పారిశ్రామిక వ్యర్థాల వల్ల ఆయా జలాశయాలు, నాలాలు, మూసీ జలాల్లో ఆక్సిజన్ శాతం దారుణంగా పడిపోతోంది.
పరిశ్రమల తరలింపులో నిర్లక్ష్యం..
1,540 కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌కు 30 కి.మీ. ఆవలకు తరలించాలని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2014లో ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. అయితే వీటి తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. నగర శివార్లలోని ముచ్చెర్లలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఫార్మాసిటీ, చౌటుప్పల్ సమీపంలోని మల్కాపూర్, చిట్యాల తదితర ప్రాంతాలకు పరిశ్రమలను తరలించాలన్న ప్రభుత్వ సంకల్పం కాగితాలకే పరిమితం కావడంతో గ్రేటర్‌లో పర్యావరణ హననం కొనసాగుతోంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన భూ కేటాయింపులు జరగకపోవడంతో ఎవరూ ఆయా ప్రాంతాలకు తరలివెళ్లడంలేదు.
కళ్లెం వేయాలిలా..
► నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యర్థాలను పారబోసేందుకు ప్రయత్నిస్తుంటే సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి.
►పీసీబీ, టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు చెందిన అధికారులతో కలసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలి.
►ఆయా బృందాలు 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉల్లంఘనుల ఆట కట్టించాలి.
►నాలాలు, చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పీసీబీ, జీహెచ్‌ఎంసీ, పోలీసు కమిషనర్ల
కార్యాలయాలకు అనుసంధానించాలి.
పారిశ్రామిక కాలుష్యంపై నిఘా లేదు
చెరువులు, నాలాలు, జలాశయాల్లోకి యథేచ్ఛగా పారిశ్రామిక వ్యర్థాలను వదిలిపెడుతున్న పరిశ్రమలపై నిఘా లేదు. వారి ఆగడాలను కట్టడి చేసే వారు లేరు. పీసీబీ, పరిశ్రమల విభాగం అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఈ ఆకృత్యాలను పట్టించుకోవడంలేదు. శివారు ప్రాంతాల్లోని చెరువులు హాలాహలంగా మారడానికి పారిశ్రామిక కాలుష్యమే ప్రధాన కారణం.
– జీవానందరెడ్డి, పర్యావరణవేత్త