17 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ | Polycet Counseling from 17th | Sakshi
Sakshi News home page

17 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

Published Wed, May 15 2019 2:25 AM | Last Updated on Wed, May 15 2019 2:25 AM

Polycet Counseling from 17th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సవరించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రవేశాల కమిటీ జారీ చేసింది. మంగళవారం నుంచే ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ పూర్తి కాకపోవడంతో ఈ నెల 17 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించేలా షెడ్యూల్‌ను సవరించింది. ఈ మేరకు మంగళవారం సవరించిన షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ నెల 17న ఆన్‌లైన్‌లో విద్యార్థుల సమాచారం నమోదు చేయడం, ఫీజు చెల్లింపును ప్రారంభిస్తామని పేర్కొంది. 17వ తేదీ నుంచి 19 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌లో స్లాట్‌బుకింగ్‌ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 18 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాలని పేర్కొంది.

ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ సమయంలో విద్యార్థులు  దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఎంపిక చేసుకోవాలని, నిర్ణీత సమయాన్ని ఎంచుకొని ఆ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజున  వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాలని సూచించింది. వెరిఫికేషన్‌ చేయించుకున్న విద్యార్థులు ఈ నెల 18 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చని వెల్లడించింది. 24వ తేదీ రాత్రికి ఆప్షన్ల ముగింపు ఉంటుందని, ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 27న సీట్లను కేటాయించనున్నట్లు వివరించింది. సీట్లు పొం దిన విద్యార్థులు ఈ నెల 28 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ట్యూషన్‌ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని తెలి పింది. విద్యార్థులు జూన్‌ 1న రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించింది. 

ఈ సర్టిఫికెట్లు మరచిపోవద్దు: బి.శ్రీనివాస్‌ 
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు వెబ్‌సైట్‌లో పేర్కొన్న సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాలని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు. పాలిసెట్‌ ర్యాంకు కార్డు, ఆధార్‌ కార్డు, టెన్త్‌ మెమో, 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్, ఈ ఏడాది జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, నివాసధ్రువీకరణ పత్రం (వర్తించే వారు) వెంట తీసుకెళ్లాలని సూచించారు. రెగ్యులర్‌గా చదువుకోని వారు అయితే ఏడేళ్ల నివాస ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజును క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ప్రాసెసింగ్‌ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.300, ఇతరులకు రూ. 600గా నిర్ణయించినట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement