వెబ్ ఆప్షన్లకు 63,777 మంది విద్యార్థులు | Web options to 63.777 students | Sakshi
Sakshi News home page

వెబ్ ఆప్షన్లకు 63,777 మంది విద్యార్థులు

Published Sat, Jul 2 2016 4:51 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

వెబ్ ఆప్షన్లకు 63,777 మంది విద్యార్థులు - Sakshi

వెబ్ ఆప్షన్లకు 63,777 మంది విద్యార్థులు

- ముగిసిన ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- 61.03 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరు
- గతేడాది హాజరైనవారు 72.53 శాతం
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో చేరేందుకు రాష్ట్రంలో 63,777 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. జూన్ 22 నుంచి శుక్రవారం వరకు ఎంసెట్‌లో అర్హత సాధించి, ర్యాంకులు పొందిన 1,04,500 మంది విద్యార్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవగా వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసే వరకు 63,777 మంది విద్యార్థులు మాత్రమే (61.03 శాతం) వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఈ వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లలో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు.

 గతేడాది కంటే తక్కువే..
 గతేడాది కంటే ఈ సారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారి సంఖ్య తగ్గింది. గతేడాది మొత్తం అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్యతో పోల్చితే వెరిఫికేషన్‌కు హాజరైన వారి శాతం బాగా తగ్గిపోయింది. గత ఏడాది ఎంసెట్‌లో 91,556 మంది అర్హత సాధించగా అందులో 66,410(72.53 శాతం) మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఈ సారి 1,04,500 మంది అర్హత సాధించినా 63,777(61.03 శాతం) మందే వెరిఫికేషన్‌కు హాజరు కావడం గమనార్హం. గతేడాది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యతో కలుపుకుని 72.53 శాతం మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ర్యాంకులు పొందిన 6,618 మందిని కలుపుకున్నా గతేడాది  కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది.

 వెబ్‌సైట్‌లో వివరాలు
 కాలేజీలవారీగా చివరి ర్యాంకు వివరాలు, కోర్సు, కేటగిరీ, జెండర్‌వారీగా గత ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల ర్యాంకుల వివరాలను తమ వెబ్‌సైట్‌లో (https://tseamcet.nic.in) అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబ్‌సైట్‌లోని ఆ వివరాలను పరిశీలించి, ఓ అవగాహనకు వచ్చాకే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.

 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ వారికి 5 నుంచి..
 ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఇంజనీరింగ్ ఎంసెట్ ర్యాంకులు పొందిన 6,618 మంది విద్యార్థులకు ఈ నెల 5, 6 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు ప్రవేశాల విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. ఆ షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులతోపాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఎంసెట్ ర్యాంకులు పొందిన 6,618 మంది విద్యార్థులకు మొదటి దశ వెబ్ ఆప్షన్లలోనే ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 నేడు ఇంజనీరింగ్ ఫీజుల జీవో!
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజులు ఖరారయ్యాయి. శుక్రవారం జరిగిన ప్రవేశాలు, ఫీజుల నియం త్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) సమావేశంలో కాలేజీల వారీగా ఫీజులను నిర్ణయించారు. ఫీజుల ప్రతిపాదనలను శుక్రవారం సాయంత్రమే ప్రభుత్వానికి పంపడంతో శనివారం ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ పరిశీలనకు పంపిస్తే ఆదివారం లేదా సోమవారాల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. శుక్రవారం జరిగిన ఏఎఫ్‌ఆర్‌సీ సమావేశంలో సీబీఐటీ కాలేజీ ఫీజును గతంలో ఉన్నట్లు రూ.1,13,500గా నిర్ణయించినట్లు తెలిసింది. మొదట్లో తమ కాలేజీ ఫీజును రూ.2.59 లక్షలకు పెంచాలని యాజమాన్యం ప్రతిపాదనలు పంపించింది. కాలేజీ ఆదాయ వ్యయాలను పరిశీలించిన ఏఎఫ్‌ఆర్‌సీ మొదట కాలేజీ వార్షిక ఫీజు రూ.1,09,000గా నిర్ణయించింది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ ఫీజుకు అంగీకరించలేదు. చివరకు యాజమాన్యం వివరణలు పరిశీలించాక రూ. 1,13,500గా నిర్ణయించింది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ ఫీజుకు అంగీకరిస్తూ సంతకం చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement