వంద రోజుల్లో ఒక్క హామీ నెరవేర్చలేదు
టీఆర్‌ఎస్‌పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజం
ఖమ్మం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళవారం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కూసుమంచి నుంచి మొదలైన భారీ స్వాగత ర్యాలీ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వరకు సాగింది. అనంతరం, పార్టీ కార్యాలయంలో స్వాగత సభ జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పొంగులేటి మాట్లాడుతూ... ‘టీఆర్‌ఎస్‌ను, దాని అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారు. కేసీఆర్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ము చేశారు. వారిని నట్టేట ముంచారు’ అని ధ్వజమెత్తారు. సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్.. ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకైనా ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? అని ప్రశ్నించారు.
హుదూద్ బాధితులకు రూ.లక్ష విరాళం
హుదూద్ తుపాను బాధితులకు వైఎస్సార్ సీపీ తెలంగాణ నేతలు అండగా ఉంటారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీగా తన వేత నం నుంచి లక్ష రూపాయలను అక్కడి బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మం డల నేతలు కూడా విరాళాలు సేకరించి, బాధితులను ఆదుకుంటారన్నారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు తన వేతనం నుంచి రూ. 20 వేలు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన వేతనం నుంచి రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు.