అవినీతిపై వేడెక్కిన మండలి
►దమ్ముంటే ‘కమీషన్ల’పై విచారణకు ఆదేశించాలి: షబ్బీర్ అలీ
► మీ, మా ప్రభుత్వాల అవినీతిపై విచారణకు సిద్ధమేనా?: నాయిని
సాక్షి, హైదరాబాద్: అవినీతి అంశంపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. గురువారం బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైన సందర్భంగా కాంగ్రెస్‌పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అవినీతిని గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత చర్చలో పాల్గొన్న టీఆర్‌ఎస్ సభ్యుడు పురాణం సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చేపట్టిన జలయజ్ఞంలో కాంట్రాక్టర్ల నుంచి 10 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై విపక్షనేత షబ్బీర్ అలీ, పొంగులేటి అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ పాతూరి సుధాకరరెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు– షబ్బీర్ అలీ, పొంగులేటిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దీనిపై షబ్బీర్ అలీ స్పందిస్తూ ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యముంటే న్యాయ విచారణ జరిపించేందుకు సిద్ధం కావాలని తాము కూడా సహకరిస్తామని సవాల్ విసిరారు. గత మూడేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉందని, ఇప్పటికీ ఆయా ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌లు ఎవరు చేస్తున్నారో పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ కాంట్రాక్టర్లు ఎంతమంది పనులు చేస్తున్నారో తెలుస్తుందన్నారు. ఆ తర్వాత కూడా పాతూరి–పొంగులేటి మధ్య వాద ప్రతివాదాలు సాగాయి. ఈ దశలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జోక్యం చేసుకుంటూ 2004 నుంచి కాంగ్రెస్ పాలనలో పదేళ్లలో చోటుచేసు కున్నవి, మూడేళ్ల టీఆర్‌ఎస్ హయాంలో జరిగిన వాటిపై విచారణకు సిద్ధమేనా అంటూ కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించారు.
అందుకు తాము సిద్ధమేనంటూనే గత ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే అది ముగిసిపోయిందని ఆయన చెప్పారు. అంతకు ముందు పురాణం సతీష్ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఎస్సీ, ఎస్టీలకు నష్టం జరిగిందని అన్నారు. షబ్బీర్ అలీ కలగజేసుకుని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇది నాలుగో బడ్జెట్ అని ఇంకా గత ప్రభుత్వాలు అనడం సరికాదన్నారు. ఖర్చుకాని ఎస్సీ, ఎస్టీల నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయలేదని ప్రశ్నించారు. పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకొచ్చిన మొదటిదశలో రూ.25 కోట్లు అధికంగా కేటాయించారని ఆ కాంట్రాక్టర్ల ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.