ప్రాజెక్టులపై చర్చిద్దామా?
సీఎం, నీటిపారుదల మంత్రికి పొన్నం, గండ్ర సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో చిత్తశుద్ధి కరువైందని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌పై విమర్శలు మాని 2014కు ముందు, ఈ మూడేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, సాగునీటి మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. ‘మిస్టర్ చీఫ్ మినిస్టర్, మిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్.. దమ్ముంటే సవాల్ స్వీకరించండి..’అని వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ భవన్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు.
జనహిత పేరుతో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభల్లో కాంగ్రెస్‌ను తిట్టడమే ఆ పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారని పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉంటామని కేసీఆర్ చెబుతారా అని ప్రశ్నించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మూడేళ్ల తరువాత కసరత్తు లేకుండా సర్క్యులర్ జారీ చేసి చిత్తశుద్ధి చాటుకున్నారని ఎద్దేవా చేశారు. గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఫోబియా పట్టుకుందని, దానికి చికిత్స తీసుకోవాలని వ్యాఖ్యానించారు.