
‘సర్వేపై నమ్మకం ఉంటే ఎన్నికలకు వెళ్లండి’
సిరిసిల్ల: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు 87 శాతం అనుకూల వాతావరణం ఉన్నట్లు చెబుతున్న సర్వేపై విశ్వాసముంటే ఎన్నికలకు వెళ్లాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పుడు సర్వేను తాము విశ్వసించడం లేదని, టీఆర్‌ఎస్ నాయకులు దానిని నమ్మితే తక్షణమే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలువాలన్నారు.
పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, ఇప్పటికే తమ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారన్నారు. మిడ్ మానేరుకు గండిపడిన సమయంలో ప్రతిపక్షాలు బురద రాజకీయాలు మానుకోవాలని, నెలరోజుల్లో అన్నీ సర్దుకుంటాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారని, కానీ నెలరోజులు దాటినా ఎలాంటి పురోగతి లేదని, మంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఓ వైపు కాంట్రాక్ట్ రద్దు చేశామని ప్రకటించినా, మరో వైపు పనులు నడుస్తున్నాయని, మొత్తం కాంట్రాక్ట్ రద్దు చేశారా, సగం రద్దు చేశారో వెల్లడించాలని పొన్నం డిమాండ్ చేశారు.