
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని పొన్నం శుక్రవారమిక్కడ విమర్శించారు. విహార యాత్రలు, పండుగల పేరుతో కాలం గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. కాగా విద్యుత్ కోతలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్లో కలెక్టరేట్ వద్ద నేడు ధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయల్దేరారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తీవ్రమైన నేపథ్యంలో రైతులు నిర్వేదానికి గురవుతున్నారు. విద్యుత్ కోతలతో పంటలు పూర్తిగా ఎండిపోవటంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తూ పంటకు నిప్పు పెట్టారు. వరంగల్ జిల్లా హన్మకొండ మండలం నక్కలపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.