‘మోదీ సర్కార్.. పేదల వ్యతిరేకి’
దోమలగూడ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ పేదల వ్యతిరేకిలా వ్యవహరిస్తోందని బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీర్‌సింగ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ బిల్లు, రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత హామీలకు వ్యతిరేకంగా బీఎస్పీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013లో యూపీఏ ప్రభుత్వం భూసేకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ కూడా ఆమోదించిందని, అప్పుడు ఆమోదించి ప్రస్తుతం సవరణ బిల్లు తేవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
రైతు వ్యతిరేక భూసేకరణ సవరణ బిల్లు పార్టమెంటులో ఆమోదం పొందకుండా అడ్డుకుంటామని తెలిపారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం బాలయ్య, ప్రధానకార్యదర్శి ఎండీ పాల్‌వేదాంత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ సవరణ బిల్లు బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.