
నాపై సర్వ హక్కులు వాళ్లవే: మోదీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పేద ప్రజలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో పనిచేసిన ప్రధానులు అందరికంటే కూడా తనపై అన్ని హక్కులు పేదలవేనన్నారు. పేదరికాన్ని అర్ధం చేసుకోవడానికి ఫొటోగ్రాఫర్లను వెంటబెట్టుకెళ్లాల్సిన అవసరం లేదని పరోక్షంగా విపక్ష నాయకులకు చురకలంటించారు.
సోమవారం ఢిల్లీలో 46వ భారత కార్మిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 'కొదరు నాయకులు కెమెరామెన్లను వెంటతీసుకెళితే తప్ప పేదరికం ఎలాఉంటుందో అర్ధం చేసుకోలేరు. నాకు మాత్రం ఆ అవసరం లేదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది పేదరికంలోనే.. పేదల మధ్యనే. కాబట్టే దాని బాధ ఎలా ఉంటుందో నాకు సులువుగా అర్ధమవుతుంది. పేదరికాన్ని ఎరిగినవాణ్నే గనుక దేశం నుంచి దాన్ని తొలిగించివేసేందుకు కంకణబద్ధుణ్నై ఉన్నాను' అని ఉద్ఘాటించారు. గత ప్రధానుల కంటే తనపైనే పేదలకు ఎక్కువ హక్కులు ఉన్నాయన్నారు.