విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం
కుడకుడ(చివ్వెంల) : విద్యుత్ కోతను నిరసిస్తూ మండలంలోని కుడకుడ రైతులు శనివారం స్థానిక సబ్‌స్టేషన్ ముట్టడించారు. మూడు రోజులుగా సబ్‌స్టేషన్ పరిధిలోని ఐలాపురం, గాయంవారిగూడెం, రోళ్లబండ తండాగ్రామాలకు కరెంటు సరఫరా లేదు. దీంతో పొలాలు ఎండిపోతున్నాయి. కరెంటు సరఫరా విషయమై అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మూడు గ్రామాల రైతులు కుడకుడ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అనంతరం సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరా విషయమై స్థానిక లైన్‌మన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించా రు. పొలాలు ఎండిపోవడంతోపాటు గ్రామాల్లో తాగునీటి కోసం నరకయాతన పడాల్సి వస్తుందన్నారు. రాత్రివేళలో చీకటిలో మగ్గుతున్నామన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కె.నర్సింహరావు సంఘటనస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ట్రాన్స్‌కో ఎఈ శ్రీనివాస్‌రావును పిలిపించాలని డిమాండ్ చేయ గా, ఎస్‌ఐ వెంటనే ఏఈని పిలిపించారు. అనంతరం రైతులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఈకి అందించి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో 200మంది రైతులు పాల్గొన్నారు.