నల్లగొండ : జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఖరీఫ్ సీజన్ కావడం వల్ల వ్యవసాయానికి విద్యుత్ వాడకం పెరగడంతో గృహావసరాలకు విపరీతంగా కోత విధిస్తున్నారు. అధికారిక కోతలకు తోడుగా అనధికారిక కోతల వల్ల ప్రజలు విలవిల్లాడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఉండే చిరు వ్యాపారులు ఛిద్రమవుతున్నారు. ఉదయం వేళలో కూడా గంటల కొద్దీ విద్యుత్ కోతల వల్ల వేసవిని తలపించే విధంగా ఉన్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 11,70,414 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా ఉండాలంటే వినియోగదారుల డిమాండ్ ప్రకారం 21 నుంచి 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది.
కానీ జిల్లాకు 17.62 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కోటా మాత్రమే విడుదలవుతోంది. అయినా ఇటీవల విద్యుత్ వాడకం పెరగడంతో 18 మిలియిన్ యూనిట్ల వరకు వాడుకుంటున్నారు. అధికారికంగా జిల్లా కేంద్రంలో నాలుగు గంటలు, మున్సిపాలిటీలలో ఆరు గంటలు, మండల కేంద్రాలలో ఎనిమిది గంటలు, గ్రామాలలో తొమ్మిది గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కానీ అధికారికంగా ప్రకటించిన సమయంలో కాకుండా మున్సిపాలిటీలలో కూడా రాత్రివేళలో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉదయం మొత్తం విద్యుత్ కోత విధించడంతోపాటు రాత్రి వేళలో కూడా విద్యుత్ తొలగించడం వల్ల చీకట్లు కమ్ముకుంటున్నాయి.
నష్టపోతున్న చిరు వ్యాపారులు..
పట్టణ ప్రాంతాల్లో ఉండే చిరు వ్యాపారులు విద్యుత్ కోతల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జీరాక్స్ సెంటర్లు, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌ల వారితోపాటు విద్యుత్ సౌకర్యంతో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రాల్లో ఎనిమిది గంటల పాటు విద్యుత్ కోతలు విధించడం వల్ల చిరు వ్యాపారాలు పూర్తిగా మూతపడుతున్నాయి.
పరిశ్రమలకు తప్పని కోత
పరిశ్రమలకు వారానికి ఒకరోజు మాత్రమే అధికారికంగా పవర్ హాలిడేను ప్రకటించిన అధికారులు ఇతర సమయాల్లో కూడా విద్యుత్ కోత విధిస్తున్నారు. పరిశ్రమలకు ప్రతి శుక్రవారం విద్యుత్‌కు సెలవు ప్రకటించినప్పటికీ వారంలో మరో రెండు రోజుల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా రైస్ ఇండస్ట్రీ, నాపరాయి పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలకు విద్యుత్ కోతలు పెంచడం వల్ల ఉత్పత్తి తగ్గి ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వ్యవసాయానికి గంట కుదింపు..
వ్యవసాయానికి గతంలో ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేసిన అధికారులు ప్రస్తుతం ఆరు గంటలకు కుదించారు. అది కూడా పగలు, రాత్రి రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు గ్రూపులుగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఏ గ్రూపు వారికి రాత్రి ఒంటి గంట నుంచి 4 గంటల వరకు, ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, బీ గ్రూపు వారికి రాత్రివేళలో 4 గంటల నుంచి 7 గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు
గృహ అవసరాలు 75,4672
కమర్షియల్ 77,848
పరిశ్రమలు 8370
వ్యవసాయం 3,11,237
కాటేజీలు 3106
వీధిలైట్లు 4866
నీటిసరఫరా విభాగం 5527
దేవాలయాలు 4769
తాత్కాలికమైనవి 19
ఇక్కట్‌లు
Published Tue, Aug 19 2014 3:02 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement