సాక్షి, సిటీబ్యూరో: గాలివానకు విద్యుత్ లైన్లు వణికిపోయాయి. టప్‌టప్‌మంటూ ట్రిప్పయ్యాయి. నగరంలో శనివారం సాయంత్రం కురిసిన చిన్నపాటి గాలివానకు చాలాప్రాంతాల్లో 11కేవీ, 33కేవీ ఫీడర్లు బ్రేక్‌డౌన్ అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలు రాత్రంతా అంధకారంలోనే ఉన్నాయి. వర్షం తగ్గిన తర్వాత లైన్లు సరిగా ఉన్నచోట వెనువెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా... విద్యుత్ టవర్లు, స్తంభాలు కూలిన, చెట్లు, కొమ్మలు విరిగిపడి లైన్లు తెగిపడిన సమస్యాత్మక ప్రాంతాల్లో పునరుద్ధరణకు ఆరేడు గంటలకు పైగా సమయం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వరకు గానీ విద్యుత్ రాలేదు. నిరంతర విద్యుత్ సరఫరాతో చాన్నాళ్లుగా నగరంలో జనరేటర్ల వాడకం లేదు.
అందులో డీజిల్ ఉందో? లేదో? కూడా చాలా సముదాయాలు పట్టించుకోలేదు. ఇన్వర్టర్ల గురించి కూడా మర్చిపోయారు. రీచార్జ్ లాంతర్లను మూలన పడేశారు. ఒక్కసారిగా శనివారం కురిసిన గాలివానకు నగరంలోని అత్యధిక ప్రాంతాల్లో అంధకారం నెలకొనడంతో జనరేటర్లు, ఇన్వర్టర్లు, లాంతర్లను బయటకు తీసినా... డీజిల్, చార్జింగ్ అయిపోవడం తదితర కారణాలతో ఒకట్రెండు గంటలే అవి పనిచేశాయి. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో చీకట్లోనే గడపాల్సి వచ్చింది. చల్లగాలులతో ఉక్కపోత బాధ తప్పినప్పటికీ... దోమల బెడదకు నిద్ర కూడా పట్టలేదని పలువురు వాపోయారు. లైన్ల పునరుద్ధరణకు ఏటా రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
ఆరేడు గంటలు...
గంటకు 60–70 కి.మీ వేగంతో వీచిన ఈదురు గాలులకు కొన్నిచోట్ల చెట్లు కరెంట్ స్తంభాలపై విరిగిపడ్డాయి. అత్యధిక ప్రాంతాల్లో కొమ్మలు తీగలపై పడడంతో సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓవర్‌హెడ్ లైన్లు కావడంతో గాలులకు తీగలు ఒకదానికొకటి రాసుకొని ట్రిప్పయ్యాయి. ఎక్కువ శాతం చిన్నచిన్న కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో సరఫరా నిలిచిపోయింది. లైన్లను పునరుద్ధరించేందుకు ఎక్కువ సమయం పట్టింది. రాత్రి గాలులు కొంత తగ్గుముఖం పట్టడంతో సీబీడీ బృందాలు రంగంలో దిగి ఒక్కో ప్రాంతంలో కరెంట్‌ను పునరుద్ధరించుకుంటూ వెళ్లాయి. డిస్కం ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాత్రి వేళ కావడం, అవసరమైన సిబ్బంది లేకపోవడంతో పలు సర్కిళ్లలో మరమ్మతులు పూర్తి చేసి కరెంట్ ఇచ్చేందుకు సగటున ఆరేడు గంటల సమయం పట్టింది.
స్పందించని సిబ్బంది...
మెట్రో జోన్ పరిధిలో వందకి పైగా ఫీడర్లలో అంతరాయాలు ఏర్పడ్డాయి. తారామతి బారాదరిలో 33కేవీ టవర్ కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచి, ఆయా ఫీడర్ల పరిధిలోని వినియోగదారులకు ఇబ్బందులు తప్పలేదు. గోల్కొండ, తారామతి బారాదరి, బండ్లగూడ, పాతబస్తీ, చార్మినార్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, వికారాబాద్, హబ్సిగూడ పరిధిలో 15 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో రాంత్రంతా అంధకారం నెలకొంది. ఆదివారం ఉదయానికి గానీ కరెంట్ ఇవ్వలేకపోయారు. గాలివాన వెలిసి గంటలు గడుస్తున్నా కరెంట్ రాకపోవడంతో... ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు స్థానికులు ఫ్యూజ్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే సరైన స్పందన రాలేదు. ఒకవేళ ఫోన్ ఎత్తినా దురుసుగా మాట్లాడడం, విసురుకోవడం, ముక్తసరిగా సమాధానం చెప్పి ఫోన్ పెట్టేస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఎన్నిసార్లు చేసినా లైన్లు కలవలేదనే ఫిర్యాదులే ఎక్కువగా అందడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment