యాచారం: ప్రతీ నెల 50 యూనిట్లలోపు గృహ వినియోగానికి ఎస్సీ, ఎస్టీలకు బిల్లులు మాఫీ అని కిరణ్ సర్కార్ హయాంలో ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. వారి ఆనందం నిలవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. అప్పటి ప్రభుత్వం సబ్‌ప్లాన్ కింద నిధులు విడుదల చేయకపోవడంతో పైసా కూడా మాఫీ కాలేదు. మరోవైపు బకాయిలు చెల్లించాలని విద్యుత్ అధికారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
అప్పట్లో మండలంలోని 20 గ్రామాల్లో గృహ వినియోగానికి విద్యుత్ వాడుకునే ఎస్సీ,ఎస్టీలను 2,500 మంది వరకు గుర్తించారు. అందులో 900 మందికిపైగా ప్రతి నెల 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తున్నారని గుర్తించి వారికి సబ్‌ప్లాన్ మాఫీ వర్తించేలా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఆయా గ్రామాల్లోని రాజకీయపక్షాల నాయకులు సైతం విద్యుత్ వినియోగంపై చైతన్యం తెచ్చి అధిక శాతం మందికి మాఫీ వర్తింపజేసేలా కృషి చేశారు. మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, మొండిగౌరెల్లి, చింతుల్ల, నల్లవెల్లితండా, తక్కళ్లపల్లి తండా, గునుగల్ తదితర గ్రామాల్లో వందలాది మంది ప్రతి నెల 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేసే లబ్ధిదారులున్నారు.
బకాయిలు చెల్లించాలని ఒత్తిడి
మండలంలోని 2,500 మంది ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి బకాయిలు రూ.40 లక్షలకు పైగా ఉండడం, సబ్‌ప్లాన్ కింద అర్హులైన 900 మంది లబ్ధిదారులకు సంబంధించి ఏడాది కాలంగా రూ.20 లక్షలకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. అప్పట్లో ప్రభుత్వ హామీతో లబ్ధిదారులు మాఫీ అవుతుందిలే అని బిల్లులు చెల్లించడమే మానేశారు. రూ. లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి.
వాటిని ఎలాగైనా వసూలు చేయాల్సిందేనని అధికారులు పట్టుదలతో ఉన్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన తీవ్రమైంది. నెలకు రూ.వందల్లో చెల్లిస్తే నేడు బకాయిలు ఉండేవి కావని, ఇప్పుడు రూ. వేలల్లో ఉన్న బకాయిలను ఎలా చెల్లించాలని దిగులు చెందుతున్నారు. కిరణ్ సర్కార్‌ను నమ్మి నిండా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వమైనా తమపై జాలి చూపి విద్యుత్ బకాయిలు మాఫీ చేసేలా కృషి చేయాలని కోరుతున్నారు.
మాఫీ అన్నారు..‘చేయి’చ్చారు
Published Sun, Aug 10 2014 1:00 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement