విస్తారమైన వర్షాలే కారణం
కోతలను ఎత్తేయాలని టీ సర్కార్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, తగ్గిపోయిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో... తెలంగాణలో విద్యుత్ డిమాండ్ తగ్గింది. కొద్దిరోజులుగా దాదాపు 150 మిలియన్ల దాకా చేరిన విద్యుత్ డిమాండ్.. ఏకంగా ఆదివారం 40 మిలియన్ యూనిట్ల మేర తగ్గి, 110 నుంచి 115 మిలియన్ యూనిట్లకు చేరినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్న విద్యుత్ కోతలను ప్రభుత్వం ఆదివారం నుంచి ఎత్తివేసింది. గత వారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ దాదాపు 150 నుంచి 160 మిలియన్‌యూనిట్లకు చేరింది. ఎక్స్ఛేంజీ నుంచి వి ద్యుత్‌ను కొనుగోలు చేసినా రోజూ 10 నుంచి 20 మిలి యన్ యూనిట్ల కొరత ఎదురైంది. కానీ తాజాగా డిమాండ్ తగ్గడంతో.. తాత్కాలికంగా నాగార్జునసాగర్‌లో జల విద్యుదు త్పత్తిని ప్రభుత్వం నిలిపివేసినట్లు జెన్‌కో వర్గాలు తెలి పాయి. శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రం ఆదివారం పగలంతా ఉత్పత్తి నిలిపివేసిన అధికారులు... సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 2 జనరేటర్ల నుంచి 290 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా... 14,832 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.098 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇందుకు 0.7 టీఎంసీల నీటిని వాడారు. వర్షాల నేపథ్యంలో ఆదివారం రోజా గేజింగ్ పాయింట్ నుంచి 8,800 క్యూసెక్కుల స్వల్ప వరదనీటి ప్రవాహం విడుదలైంది. ఈ జలాలు సోమవారం సాయంత్రానికి శ్రీశైలం డ్యామ్‌కు చేరుతాయి. కర్నూలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి స్వల్పంగా నీరు చేరుతోంది. ఆదివారం ఉదయానికి 856.4 అడుగులున్న నీటిమట్టం సాయంత్రానికి 856.5 అడుగులుగా నమోదైంది.
కోతలు ఎత్తివేత:ఖరీఫ్ పంట కాలం ముగిసే సీజన్ కావడంతో వర్షాలు ఊరట కలిగించాయి. దీంతో వీలైనంత మేరకు కోతలను ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు ఆదివారం సీఎం కేసీఆర్‌తో టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్, ఎండీ ప్రభాకర్‌రావు సమావేశమయ్యారు. ఇప్పుడున్న డిమాండ్, సరఫరాపై చర్చించారు. కోతల ఎత్తివేత, పరిశ్రమలకు పవర్ హాలిడేను తగ్గించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే కొనసాగుతోంది. తాజాగా విద్యుత్ డిమాండ్ తగ్గిన మేరకు.. పరిశ్రమలకు విద్యుత్‌ను అందించనున్నారు. ఖరీఫ్ పంటల కోతలు నవంబర్ ఒకటి నాటికి దాదాపు పూర్తవుతాయని... మరింతగా డిమాండ్ తగ్గే అవకాశం ఉండడంతో అప్పటి నుంచి పవర్ హాలిడేను ఒక రోజుకు కుదించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తగ్గిన విద్యుత్ డిమాండ్
Published Mon, Oct 27 2014 2:01 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement