రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ కరెంటొచ్చేసింది | power supply from Chhattisgarh to Telangana started | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ కరెంటొచ్చేసింది

Published Sun, Apr 2 2017 4:42 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ కరెంటొచ్చేసింది - Sakshi

రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ కరెంటొచ్చేసింది

ప్రయోగాత్మకంగా సరఫరా ప్రారంభం
రెండు మూడు రోజుల్లో అధికారికంగా సరఫరా
పీపీఏపై ఇంకా నిర్ణయం వెలువరించని తెలంగాణ ఈఆర్సీ
యూనిట్‌కు రూ.3.90గా ఖరారు చేసిన ఛత్తీస్‌ ఈఆర్సీ
తుది ధర రూ.4.50 వరకు ఉంటుందంటున్న నిపుణులు
అప్పటి వరకు లాభనష్టాలపై కొనసాగనున్న సస్పెన్స్‌  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్‌ కరెంటొచ్చేసింది! పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(పీజీసీఎల్‌) నిర్మించిన వార్ధా(మహారాష్ట్ర)–డిచ్‌పల్లి(నిజామాబాద్‌) 765 డీసీ విద్యుత్‌ కారిడార్‌ ద్వారా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి రాష్ట్రానికి ఈ విద్యుత్‌ సరఫరా అవుతోంది. రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను బట్టి వార్ధా–డిచ్‌పల్లి గ్రిడ్‌ నుంచి 650 మెగావాట్ల నుంచి 700 మెగావాట్లను తెలంగాణ ట్రాన్స్‌కో డ్రా చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు కరెంట్‌ సరఫరా ఉండడంతో ఎన్టీపీసీ కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసి ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ తీసుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన వార్ధా–డిచ్‌పల్లి లైన్ల చార్జింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాతమరో రెండు మూడ్రోజుల్లో అధికారిక సరఫరా ప్రారంభమవుతుందని తెలంగాణ ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎన్‌ఎల్‌డీసీ) నుంచి ఇందుకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.

వాదోపవాదాలే.. ఇంకా తేలని ధర..
రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలు–విపక్షాలు, విద్యుత్‌ రంగ నిపుణుల నడుమ గత రెండున్నరేళ్లుగా ఎన్నో వాదోపవాదాలు, ఆరోపణలు, విమర్శలకు ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కేరాఫ్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా ప్రారంభమైనా ధరపై ఇంత వరకు కచ్చితత్వం లేదు. తుది ధరను ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీ ప్రకటించిన తర్వాతే విద్యుత్‌ కొనుగోళ్ల ద్వారా తెలంగాణకి లాభమో నష్టమో అన్న అంశాలపై స్పష్టత రానుంది. ఛత్తీస్‌గఢ్‌లో 2017–18లో అమలు చేయాల్సిన విద్యుత్‌ టారీఫ్‌ ఉత్తర్వులను తాజాగా ఆ రాష్ట్ర ఈఆర్సీ జారీ చేసింది. మార్వా థర్మల్‌ ప్లాంట్‌ విద్యుత్‌కు సంబంధించి తాత్కాలిక ధరను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. వార్షిక స్థిర చార్జీలు రూ.1871.72 కోట్లు, పీ అండ్‌ జీ కాంట్రిబ్యూషన్‌ రూ.19.13 కోట్లు, చర వ్యయం యూనిట్‌కు రూ.1.20గా అమలు చేయాలని సూచించింది.

ఈ గణాంకాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ తాత్కాలిక ధర యూనిట్‌కు రూ.3.90 కానుంది. ఛత్తీస్‌ విద్యుత్‌ తుది ధర కూడా యూనిట్‌కు రూ.3.90కు మించదని, పీజీసీఎల్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు కలుపుకుంటే రూ.4.30 నుంచి రూ.4.40 లోపు ఉంటుందని ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన ‘సీటీయూ’ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు, ట్రేడింగ్‌ మార్జిన్‌ను మినహాయించేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించడంతో రాష్ట్రంపై పడే భారం కొంతవరకు తగ్గిందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. మార్వా విద్యుత్‌ కేంద్రం 2008లో రూ.4,735 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభం కాగా.. నిర్మాణం పూర్తయ్యేసరికి వాస్తవ వ్యయం రూ.8214.45 కోట్లకు ఎగబాకింది.

పెట్టుబడి రుణాలపై నిర్మాణ కాల వడ్డీ(ఐడీసీ)లు కలుపుకుంటే నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ.9 కోట్ల వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్సీ ఖరారు చేసే తుది ధర యూనిట్‌కి రూ.4.50 నుంచి రూ.5.00 వరకు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పీజీసీఎల్, ఇతర ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు కలుపుకుంటే విద్యుత్‌ రాష్ట్రానికి చేరే సరికి యూనిట్‌కు రూ.5.50 వరకు ఖర్చు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే విద్యుత్‌ ధర యూనిట్‌కి రూ.3.90 కంటే మించొద్దని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించామని ట్రాన్స్‌కో పేర్కొంటోంది.

త్వరలో తేల్చండి.. ఈఆర్సీకి ట్రాన్స్‌కో లేఖ
ఛత్తీస్‌గఢ్‌ విద్యుదుత్పత్తి సంస్థ(సీఎస్‌పీజీసీఎల్‌) నిర్మించిన 1000 మెగావాట్ల మార్వా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబర్‌ 22న రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో పీపీఏ కుదుర్చుకుంది. టెండర్లకు బదులు పరస్పర అంగీకార ఒప్పందం(ఎంఓయూ) ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రాష్ట్రం ఏటా రూ.1000 కోట్ల భారం పడుతుందని విద్యుత్‌ రంగ నిపుణులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అభ్యంతరాలపై ఏడాది కింద బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్సీ... ఈ పీపీఏపై ఇంత వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా ప్రారంభమైన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ పీపీఏపై సత్వర నిర్ణయం తీసుకోవాలంటూ ట్రాన్స్‌కో శనివారం టీఎస్‌ఈఆర్సీకి లేఖ రాసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement