కేంద్రానిదే బాధ్యత | power wiil be given to telangana is centre responsibility | Sakshi
Sakshi News home page

కేంద్రానిదే బాధ్యత

Published Tue, Nov 11 2014 1:51 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ - Sakshi

అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

విద్యుత్ సమస్యపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
 
 
 సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి న్యాయమైన విద్యుత్ వాటా ఇప్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనంటూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ‘‘పునర్విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘించింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను కేంద్రం తీసుకోవాలి. ఏపీ సర్కారు స్పందించకపోతే కేంద్రం తన వంతుగా ఆ రాష్ట్రానికి ఇచ్చే విద్యుత్ కోటాను తెలంగాణకు మళ్లించాలి. 24 గంటల విద్యుత్ పథకాన్ని కూడా వర్తింపజేయాలి’’ అన్నది దాని సారాంశం. అలాగే తెలంగాణకు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలవాలని కూడా సభ నిర్ణయించింది. రాష్ర్టంలో నెలకొన్న విద్యుత్ సమస్య, రైతుల ఆత్మహత్యలపై సోమవారం అసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అధికార, విపక్షాల వాదనలతో సభలో వాతావరణం వేడెక్కింది. సమస్యలకు కారణం మీరంటే మీరంటూ పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అన్ని పార్టీలకూ సెగ తగిలింది. వాడివేడి చర్చ, ఘాటు వ్యాఖ్యలు.. మధ్యమధ్యలో స్వల్ప వాయిదాలతో రాత్రి పొద్దుపోయే వరకూ సభ కొనసాగింది. సాయంత్రం 4 గంటలకు విద్యుత్‌పై చర్చ మొదలైనప్పటి నుంచే సభ్యులంతా ఎవరికి వారే గట్టి వాదన వినిపించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసిన ప్రతిసారీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లేచి సమాధానమివ్వడం, దానికి ప్రతిపక్షాలు వెంటనే ప్రతిస్పందించడంతో చర్చ ఆద్యంతం తీవ్ర ఆగ్రహావేశాలు, వాదోపవాదాలతో సాగింది. ప్రభుత్వ అసమర్థతను పొరుగురాష్ట్రంపై నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం సభ్యుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎంకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ‘అసెంబ్లీకిది బ్లాక్ డే’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ర్ట ప్రయోజనాలు కాదని... పొరుగు రాష్ట్రాన్ని సమర్థిస్తున్నారంటూ రేవంత్‌పై మండిపడ్డారు. పక్క రాష్ట్రం చేస్తున్న తప్పును సమర్థించే ప్రయత్నం ఇక్కడి సభ్యుడు చేయడం శోచనీయమని ధ్వజమెత్తారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చలో విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానాలిచ్చారు. మూడేళ్ల తర్వాత కనురెప్ప పాటు కూడా కోత లేకుండా.. 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ‘2016 జనవరి నాటికి 2000 మెగావాట్లకుపైగా విద్యుత్తును సమకూర్చుకుంటాం. సింగరేణి ద్వారా 1200 మెగావాట్లు, భూపాలపల్లిలో 600 మెగావాట్లు, కేంద్రం నుంచి 500 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది. రెండు విడతలుగా 4000 మెగావాట్ల విద్యుత్తు సమకూర్చుకునేందుకు టెండర్లు పిలిచాం. కృష్ణపట్నం, హిందూజాల నుంచి 1300 మెగావాట్ల విద్యుత్‌ని కోల్పోవడంతో పాటు వర్షాభావంతో ఖరీఫ్‌లో విద్యుత్ డిమాండ్‌ను అందుకోలేకపోయాం. రబీలో అలాంటి పరిస్థితి లేకుండా రైతులు సహకరించాలి. ఆరుతడి పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి కారణంగానే తెలంగాణలో విద్యుత్తు సమస్య తలెత్తింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది’ అని కేసీఆర్ వివరించారు. ముక్తకంఠంతో విద్యుత్ సమస్యపై పోరాడుదామని అన్ని పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు.
 
 చట్టప్రకారం వాటా దక్కడం లేదు
 
 ‘‘విభజన చట్టాన్ని అమలు చేసి విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాను ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం. ప్రధానిని కలుద్దాం. ఇప్పటికే ఈ అంశంపై ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించాం. కొన్ని కారణాలతో వీలు కాలేదు. మళ్లీ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరుదాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.  విభజన ఒప్పందాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ‘సీలేరు కాంప్లెక్స్.. అంటే ఎగువ సీలేరు, దిగువ సీలేరు, డొంకరాయి ప్రాజెక్టుల విద్యుదుత్పత్తి సామర్థ్యం 725 మెగావాట్లు. ఆన్‌లైన్ వివరాల ప్రకారం ప్రస్తుతం అక్కడ 390 మెగావాట్లు ఉత్పత్తవుతోంది. కృష్ణపట్నంలో 500 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తవుతోంది. షెడ్యూల్‌లో చూపకుండానే ఈ విద్యుత్‌ను ఏపీ వాడుకుంటోంది. ఏపీలోనూ కరెంట్ సక్కదనమేమీ లేదు. అక్కడ కూడా కొనుక్కుంటున్నారు. కానీ విభజన చట్టం ప్రకారం ధర్మబద్ధంగా తెలంగాణకు ఇవ్వాల్సిన వాటాను ఇవ్వడం లేదు. విభజన సందర్భంలో తెలంగాణలో ఉండాల్సిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అప్రజాస్వామికంగా లాక్కున్నారు. ఇప్పటికీ ఆ మండలాలకు మేమే విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. హుద్‌హుద్ తుపానుతో ఏపీలో విధ్వంసం జరిగితే అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్న విద్యుత్ సామగ్రిని అక్కడికి పంపించాం. ఎందుకంటే కలిసిమెలిసి ఉండాలని.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకునేటోళ్లం’ అని కేసీఆర్ అన్నారు. ‘ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4480 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేశాం. ఇందుకు రూ. 2,572 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక్కో యూనిట్‌కు సగటున రూ. 5.26 చొప్పున చెల్లిస్తున్నాం. ఖర్చుకు వెనుకాడలేదు. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కణ్నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేశాం’ అని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.
 
 తక్షణ పరిష్కారం లేదు
 
 చర్చ సందర్భంగా శ్రీశైలం జలాల వినియోగానికి సంబంధించి.. గతంలో ఉన్న పాలసీలు, జీవోలను టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి సభలో ప్రస్తావించారు. తాగునీరు, సాగునీరు తర్వాతే విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమివ్వాలని అప్పటి విధానాలు ఉన్నాయని, ఇప్పుడవే ప్రతిబంధంకంగా మారాయని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నవాళ్లే గతంలో హైకోర్టులో అటువంటి పిటిషన్లు వేశారని గుర్తు చేశారు. చంద్రబాబుపై రాజకీయ ఆరోపణలు చేస్తే ఇక్కడి సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమ ప్రజల హక్కుల సాధనకు పోరాడటంలో తప్పు లేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే న్యాయస్థానాలున్నాయని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కులు కాపాడేందుకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. దీనికి సీఎం స్పందిస్తూ.. ‘నాగార్జునసాగర్, శ్రీశైలం జలాలపై జూపల్లి కృష్ణారావు, వెదిరె వెంకట్‌రెడ్డి కోర్టుకు వెళ్లింది నిజమే. మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటి ప్రయోజనాలు కాపాడేందుకే వెళ్లారు. అందుకే శ్రీశైలంలో 834 అడుగులకంటే దిగువకు నీటి విడుదలను నిలిపేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది. అసలు ఈ నీటిమట్టం పాటించటం అర్థం లేని వాదన అని చంద్రబాబు 2002లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అందుకే గతాన్ని తవ్వుకొని ప్రయోజనం లేదు. అబద్ధాలు ఆడాల్సిన ఖర్మ నాకేం పట్ట లేదు. వారసత్వంగా తెలంగాణకు రావాల్సిందేంటి.. వచ్చిందేమిటో చెబుతున్నాం. 57 ఏళ్లుగా ఈ సమస్య ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు వెలుగులు విరజిమ్మితే..  మేమేదో స్విచ్ఛాప్ చేసినట్లు మాట్లాడటం సరైంది కాదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా తక్షణ పరిష్కారం కూడా లేదు’ అని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలు కొంత సహనంతో ఉండాలని ఆయన హితవు పలికారు. ‘కొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం. అవసరమైన విధివిధానాలు రూపకల్పన జరగాలి. అధికారులు లేరు. పరిస్థితి చక్కబడేందుకు కొంత సమయం పడుతుంది. రాజకీయ పార్టీలకు సహన శీలత ఉండాలి. సమస్య రాగానే పోరాటాలు, ఆందోళనలు చేపట్టడం సరైంది కాదు’ అని సభకు విన్నవించారు.
 
 ఇదీ తీర్మానం
 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పున ర్విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన 53.89 శాతం విద్యుత్‌ను అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడం జరిగింది. సీఈఏ, ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ, ఏపీఈఆర్‌సీ కూడా తెలంగాణకు చట్టప్రకారం విద్యుత్ సరఫరా చేయకపోవడం పొరపాటని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం సరఫరా చేయాలని సిఫారసు చేసినవి.
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విజన చట్టం-2014ను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది. వర్షాభావం, ఏపీ ప్రభు త్వ వైఖరి వల్ల విద్యుత్ సరఫరా లేక తెలంగాణ రైతాంగం తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటోంది. కేంద్రం వెంటనే స్పందించి తెలంగాణకు ఏపీ నుంచి రావలసిన న్యాయమైన విద్యుత్ వాటాను అందించేలా ఆదేశించాలని, ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే ఆ రాష్ట్రానికి కేంద్రం సరఫరా చేసే విద్యుత్ కోటా నుంచి మళ్లించి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని, కేంద్ర ప్రభుత్వ ‘అందరికి విద్యుచ్ఛక్తి’ పథకం కిందకు తెలంగాణను కూడా తీసుకుని రావాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నది’’
 
 పాలాబిషేకం చేస్తాం: రేవంత్
 
 మూడేళ్లలో 21 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తామంటున్న ముఖ్యమంత్రి.. అందులో 15 వేల మెగావాట్లను అందుబాటులోకి తెచ్చినా.. ఇదే సభలో ఆయనకు పాలాభిషేకం చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. దీంతో మొత్తం 24 వేల మెగావాట్లకు ప్రణాళికలు ఉన్నాయని, 21 వేల మెగావాట్ల ఉత్పత్తికి అవగాహన వచ్చిందని, మూడేళ్ల తర్వాత కోత లేకుండా 24 గంటల కరెంటు సరఫరా చేసి చూపిస్తామని కేసీఆర్ బదులిచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్య విషయంలో కేంద్రమే న్యాయం చేయాలని పేర్కొంటూ స్పీకర్ అనుమతితో కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరి’ అని తీర్మానంలో పేర్కొనడంపై రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ‘ధర్మబద్ధంగా ఇవ్వాల్సిన 980 మెగావాట్ల విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. ఆ ప్రభుత్వంతో పంచాయతీ ఉంటే.. ఆ మాటలో తప్పేముంది?’ అని సీఎం అన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి కల్పించుకొని ‘మొండి’ అనే పదాన్ని తొలగించాలన్నారు. జానారెడ్డి సూచన మేరకు మొండి అనే పదాన్ని తొలగించి తీర్మానాన్ని యథాతథంగా ప్రవేశపెడుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం నాలుగు గంటల పాటు రైతు ఆత్మహత్యలపై చర్చ సాగింది. రాత్రి 10.45 గంటల సమయంలో సభ మంగళవారానికి వాయిదా పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement