
పీఆర్‌సీ లేనట్టే!
* ఈ బడ్జెట్‌లో కష్టమే.. జాప్యం అనివార్యం
* అందుకే కమిటీ వేశారంటూ ఉద్యోగుల్లో ఆందోళన
* ఇప్పటికీ చర్చలు ప్రారంభించని హైపవర్ కమిటీ
* ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు దాదాపు రూ. 200 కోట్లు
* ఈ ఆర్థిక సంవత్సరంలో భారాన్ని భరించడం కష్టం
* ఇక ఏప్రిల్‌లోనే పీఆర్‌సీ వస్తుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ
* కుటుంబానికి ముగ్గురినే లెక్కగట్టడంపై అభ్యంతరాలు
* ఏడాదిన్నర కిందటి ధరలతో ఖర్చులు పోల్చారని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘జనవరి మూడో వారంలో పీఆర్‌సీపై ప్రకటన వస్తుంది. జనవరి నుంచే అమలు చేస్తాం. ఉద్యోగులు సంతృప్తి చెందేలా ప్రయోజనాలు కల్పిస్తాం.’
- గత నెల 30న సీఎం కేసీఆర్ ప్రకటన
మరోవైపు.. ఈ నెల 12న పీఆర్‌సీపై హైపవర్ కమిటీ ఏర్పాటు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర చైర్మన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ కన్వీనర్‌గా ఇది ఏర్పాటైంది. పీఆర్‌సీ కమిషనర్ అగర్వాల్ ఇచ్చిన నివేదికలోని సిఫారసులను పరిశీలించడంతోపాటు ఉద్యోగ సంఘాలతోనూ ఈ కమిటీ చర్చలు జరుపుతుందని ప్రభుత్వం ప్రకటిం చింది. ఇంకోవైపు.. పీఆర్‌సీ అమలులో ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు రూ. 180 కోట్ల నుంచి రూ. 200 కోట్లు కావాలి. ఈ లెక్కన పీఆర్‌సీ చైర్మన్ చేసిన 29 శాతం ఫిట్‌మెంట్‌కే రూ. 3,500 కోట్లకుపైగా నిధులు అవసరం.
ఈ మొత్తాన్ని ప్రస్తుత బడ్జెట్‌లో ఇచ్చే పరిస్థితి లేనేలేదు. వచ్చే బడ్జెట్‌లోకేటాయించి అమలు చేస్తేనే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. ఇక 37శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సి వస్తే రూ. 6,660 కోట్ల నుంచి రూ. 7,400 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అదే ఉద్యోగులు కోరుతున్నట్లు 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే రూ. 7,700 కోట్ల నుంచి రూ. 8,600 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని, అంత భారం ఇప్పుడు భరించడం కష్టమన్నది ఆర్థిక శాఖ వర్గాల వాదన. ఇవీ రాష్ట్రంలో పీఆర్‌సీ అమలు విషయంలో వివిధ పరిణామాలు.
ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే పీఆర్‌సీని ఇప్పట్లో అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఆర్థిక శాఖ కోణంలో చూస్తే పీఆర్‌సీ అమలు ఆలస్యమయ్యేలా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కొత్త బడ్జెట్‌లో నిధులను కేటాయించి, వచ్చే ఏప్రిల్‌లోనే అమల్లోకి తెచ్చే అవకాశముందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం చెప్పినట్లు ఈ నెలలోనే పీఆర్‌సీ అమల్లోకి వస్తుందని భావించినప్పటికీ అది ఆచరణకు నోచుకునే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆలస్యం తప్పదేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది. మరోవైపు హైపవర్ కమిటీ కూడా ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించలేదు. వచ్చే వారంలో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. అదీ అన్ని సంఘాలతో ఒకేసారి చర్చిస్తుందా లేక ఒక్కో సంఘంతో వేర్వేరుగా భేటీ అవుతుందా అన్నది తేలాల్సి ఉంది. పీఆర్‌సీ సిఫారసులపై శాఖలవారీగా ఉద్యోగుల్లో అనేక ఆందోళనలు, సమస్యలు ఉన్నాయి. వేతన స్థిరీకరణలో అన్యాయం జరిగిందన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాఖలవారీగానే సమావేశాలు నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంతో పీఆర్‌సీ అమలులో ఆలస్యం తప్పకపోవచ్చన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది.
కమిటీ తేల్చేది చిన్న లోపాలనే!
సాధారణంగా పీఆర్‌సీలో లోపాలపై, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులపై పునఃపరిశీలనకు అనామలీస్ కమిటీని వేయడం ఆనవాయితీ. హైపవర్ కమిటీలో ప్రధాన సమస్యలను తేల్చేదేమీ ఉండదన్నది సంఘాల భావన. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికే ఈ కమిటీ పరిమితమయ్యే అవకాశముంది. పైగా ఫిట్‌మెంట్, నగదు రూపంలో పీఆర్‌సీ అమలు తేదీల ఖరారు వంటి ప్రధానాంశాలపై ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు పట్ల పెద్దగా వ్యతిరేకత లేకపోయినా మరింత జాప్యం జరుగుతుందేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉంది. కనీస మూల వేతనం పెంపు, ఫిట్‌మెంట్ నిర్ణయం, నగదు రూపంలో వర్తింపు వంటి ప్రధాన అంశాలు సీఎం స్థాయిలోనే తేల్చాల్సి ఉంది. ఈ లెక్కన చిన్న చిన్న లోపాలపై హైపవర్ కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చల తర్వాత సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో మరోసారి సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని, ఇందుకు చాలా సమయం పట్టవచ్చని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
ఇరకాటంలో సంఘాల నేతలు..
మూడో వారంలో పీఆర్‌సీ అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఇరకాటంలో పడ్డాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోన్న ఆందోళన ఉద్యోగ నేతల్లో వ్యక్తమవుతోంది. ఫిట్‌మెంట్, నగదు రూపంలో పీఆర్‌సీ అమలు తేదీ తదితర అంశాలపై ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయినా, అటు ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోయినా తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పీఆర్‌సీ అమలుకు సర్కారు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
కుటుంబమంటే నలుగురు!
పదో వేతన సవరణ కమిషన్(పీఆర్‌సీ) సిఫారసుల్లో భాగంగా కుటుంబానికి ముగ్గురు సభ్యులనే(మూడు యూనిట్లుగానే) పరిగణనలోకి తీసుకోవడాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కుటుంబమంటే ముగ్గురేనన్న నిర్వచనంతో వేతన స్థిరీకరణ చేయడం అశాస్త్రీయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కల ఆధారంగానే కనీస మూల వేతనాన్ని నిర్ధారించడం సరికాదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తగిన మార్పులు చేయించుకోవాలని ఉద్యోగవర్గాలు పట్టుదలగా ఉన్నాయి. పైగా 2013 జూలై 1కి ముందున ్న నిత్యాసవరాల ధరలనే పరిగణనలోకి తీసుకోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగినందున పీఆర్‌సీ నివేదికలో సిఫారసు చేసిన రూ. 13 వేల కనీస మూల వేతనాన్ని రూ. 15 వేలకు పెంచాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. తద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా లబ్ధి కలుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
నిజానికి రాష్ట్రంలోని జనాభా, కుటుంబాల సంఖ్య సరాసరి ఆధారంగా కుటుంబ నిర్వచనం ఉంటుంది. అయితే కుటుంబమంటే మూడు యూనిట్లేనని ఇంట ర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్(ఐఎల్‌సీ) తీర్మానించింది. ఈ మేరకే లెక్కలేసి పీఆర్‌సీ కమిషన్ నివేదిక అందించింది. అయితే జాతీయ కుటుంబ సర్వే ప్రకారం నలుగురిని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో తల్లిదండ్రులు, భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉంటు న్నా.. కనీసం నాలుగు యూనిట్లను పరిగణనలోకి తీసుకుని కనీస వేతనాన్ని నిర్ధారించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఇద్దరు పిల్లల కయ్యే ఖర్చు ఒక పెద్ద వ్యక్తికంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఫీజుల రూపం లో భారీగా చెల్లించాల్సి వస్తున్నా పీఆర్‌సీ పట్టించుకోలేదని, కనీస మూల వేతనం రూ. 15 వేలు చేయాలని కోరుతున్నారు. కాగా, ఫిట్‌మెంట్‌తోపాటు నగదు రూపంలో వర్తింపు తేదీ విషయంలో ఉద్యోగుల్లో భారీ ఆశలు ఉన్నాయి. కానీ 37 శాతానికి మించి ఫిట్‌మెంట్ కష్టమేనని ప్రభుత్వవర్గాలు అంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఏ విషయంలోనూ వెనక్కి తగ్గవద్దంటూ సంఘాల నేతలకు ఉద్యోగులు గట్టిగా సూచిస్తున్నారు.
ఇదేం లెక్క?
ఒక్కో కుటుంబానికి నెలకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు తదితరాల కోసం రూ. 838 ఖర్చవుతుందని, నెలకు ఒక్కో కుటుంబానికి 42.75 కేజీల బియ్యం అవసరమని పదో పీఆర్సీ లెక్కలేసింది. కిలో బియ్యం ధరను రూ. 34.99గా పరిగణించింది. ఇక దుప్పట్ల మొదలు దుస్తుల వరకు అన్ని అవసరాలకు ఏటా రూ. 17 వేలు సరిపోతాయని పేర్కొంది. అలాగే ఒక్కో కుటుంబానికి నెలకు 18 లీటర్ల పాలతోనే సరిపెట్టింది. ఐఎల్‌సీ గణాంకాల ప్రకారమే పౌష్టికాహారం అందాలంటే నెలకు 75 లీటర్ల పాలు వినియోగించాలని, ఇలాంటి వాటిని పీఆర్‌సీ పట్టించుకోలేదని, వాస్తవిక అంచనాలతో లెక్కలుగట్టి కనీస వేతనాన్ని పెంచాలని ఉద్యోగవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.