Bandi Srinivas Rao Says We Hope CM Jagan Good PRC Employees - Sakshi
Sakshi News home page

మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం 

Published Fri, Jan 7 2022 4:13 AM | Last Updated on Fri, Jan 7 2022 12:47 PM

Bandi Srinivas Rao Says We Hope CM Jagan Good PRC Employees - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం జగన్‌ మంచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నామని.. రెండు, మూడు రోజుల్లో ఈ విషయమై ప్రకటన వస్తుందని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారన్నారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా ఆయన నోట్‌ చేసుకున్నారని తెలిపారు. అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని, మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని పదే పదే తెలిపారన్నారు.

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించారని తెలిపారు. రాష్ట్ర విభజన, కోవిడ్‌ కష్టాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేవని సీఎం చెప్పారని, తెలంగాణకు హైదారాబాద్‌ నుంచి ఆదాయం ఉన్నందున ఆ రాష్ట్రంతో పోల్చుకోవద్దని సూచించారని తెలిపారు. మొత్తంగా సీఎం జగన్‌తో సమావేశం సానుకూలంగా, ప్రశాంతంగా మంచి వాతావరణంలో సాగిందని చెప్పారు. సీఎం జగన్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పని చేస్తామని తెలియజేశామన్నారు.  

సీఎం మంచి పీఆర్సీ ప్రకటిస్తారు.. 
ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి సీఎం జగన్‌ మంచి పీఆర్సీ ప్రకటిస్తారన్న నమ్మకం ఉంది. కోవిడ్‌ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిన విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం వివరించారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వస్తుంది. కొన్ని సంఘాలు 27 శాతం ఫిట్‌మెంట్‌కు తగ్గకుండా చూడాలని, కొన్ని సంఘాలు 34 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎంను కోరాయి. హైదరాబాద్‌ నుంచి రాజధానికి వచ్చిన ఉద్యోగులకు సీసీఎ, హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలని కోరారు.  
– ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) 

సీఎం మంచి చేస్తారనే నమ్మకం 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. 34 శాతం ఫిట్‌మెంట్‌ అడిగాం. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ ఫిట్‌మెంట్‌ అడిగాం. సీఎం జగన్‌ మంచి చేస్తారనే నమ్మకం ఉంది. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన ఉంటుంది. నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటూ ఉంటారని సమావేశంలో సీఎం జగన్‌ స్వయంగా చెప్పారు. అంత మాట చెప్పిన సీఎం.. ఉద్యోగులకు ఎందుకు మంచి చేయకుండా ఉంటారు? ఉదారంగా ఉండే విషయంలో, మానవతా దృక్పథం చూపే విషయంలో తనకన్నా ఎక్కువగా స్పందించేవాళ్లు తక్కువగా ఉంటారని కూడా సీఎం తెలిపారు. ఇదే సమయంలో కొన్ని వాస్తవాలను బేరీజు వేసుకోవాలనీ సీఎం చెప్పారు. మొత్తానికి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.  
– కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 

రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం 
పీఆర్సీ సమస్య రెండు, మూడు రోజుల్లో పరిష్కారం కానుంది. ఈ నెల 9వ తేదీ లోపు సమస్య పరిష్కారం కాకపోతే ఆ రోజున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఉద్యోగులకు ఇస్తోన్న ఐఆర్‌కు తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఉంటుంది. అశుతోష్‌ కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదించాలని సీఎం జగన్‌ను కోరాం. అధికారుల కమిటీ నివేదిక కరెక్టు కాదని సీఎంకు తెలియజేశాం. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పెన్షనర్లకు సంబంధించిన అంశాల్లో తేడాలు ఉన్నాయని వివరించాం. నాలుగు అంశాలపై ఉద్యోగులు, పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిపాం. పది పీఆర్సీల్లో ఎక్కడా ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తగ్గిన దాఖలాలు లేవని వివరించాం. హెచ్‌ఆర్‌ఏపై చేసిన సిఫార్సులు అసంబద్ధంగా ఉన్నాయని తెలిపాం. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల గురించి వివరించాం. ఏడెనిమిది ఏళ్లుగా హెల్త్‌ కార్డులు నిర్వీర్యమయ్యాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పాం. ఉద్యోగుల డిమాండ్లకు సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. 
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి  

మరో భేటీ ఉండకపోవచ్చు   
పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో అంతిమ నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని సీఎం కోరారు. ఉద్యోగ సంఘాలు కూడా తగ్గాలని, ఆర్థిక శాఖ అధికారులు కూడా కొంతమేర గణాంకాలను పెంచాలని సీఎం సూచించారు. పీఆర్సీపై మరో సమావేశం ఉంటుందని మేము భావించడం లేదు. ఇంత సేపు ఉద్యోగ సంఘాలతో సీఎం మాట్లాడిన పరిస్థితి గతంలో లేదు. సంఘాలుగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నా.. అందరం వారి వారి సమస్యల్ని సీఎం జగన్‌కు తెలియజేశాం. 
– కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement