పెన్షనర్లతో చెలగాటం!
పీఆర్‌సీ సిఫారసుల అమలుపై సర్కారు జాప్యం
⇒ ప్రసుత అదనపు పెన్షన్ విధానానికి గండి కొట్టే యత్నం
⇒ రూ. 327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలు చెల్లింపులోనూ మీనమేషాలు
⇒ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కనికరించని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లతో రాష్ట్ర సర్కారు చెలగాటమాడుతోంది. పీఆర్‌సీ సిఫారసులను యథాతథంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించినా వాటి అమలు విషయంలో జాప్యం చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పెన్షన్ విధానానికి గండికొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
దీంతో పెరిగిన ఫిట్‌మెంట్‌తో పెన్షన్ పెరుగుతుందనుకొని సంబరపడ్డ రిటైర్డ్ ఉద్యోగులు డీలా పడ్డారు. మరోవైపు 1998కు ముందు రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 327 కోట్ల పెన్షన్ వ్యత్యాస బకాయిలను చెల్లించేందుకు కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వీటిని చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయటంలోనూ జాప్యం చేస్తోంది.
అదనపు పెన్షన్‌కు గండి...
75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ మంజూరు చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. పెన్షన్‌లో 15 శాతం అదనపు పెన్షన్‌గా చెల్లిస్తారు. పదో పీఆర్‌సీ సైతం 70-75 ఏళ్ల వయసున్న రిటైర్డ్ ఉద్యోగులకు 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ పెరుగుతుంది. ఒకే హోదాలో పని చేసినప్పటికీ కొన్నేళ్ల కిందట రిటైరైన ఉద్యోగులకు.. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు అందే పెన్షన్‌లో భారీగా వ్యత్యాసముంటోందని తొమ్మిదో పీఆర్‌సీ గుర్తించింది.
దీన్ని కొంతమేరకైనా తగ్గించేందుకు 75 ఏళ్లు దాటిన రిటైర్డ్ ఉద్యోగులకు వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ ఇవ్వాలని సూచించటంతో ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ విధానాన్ని 70 ఏళ్లకే కుదించాలని పదో పీఆర్‌సీ సిఫారసు చేసింది. కానీ అందుకు సంబంధించిన వివరణను పొందుపరచలేదు. అదే సాకుగా అదనపు పెన్షన్ల విషయాన్ని ఆర్థికశాఖ దాటవేసింది. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తటంతో 70 ఏళ్ల వయసు నుంచే అదనపు పెన్షన్ మంజూరు చేస్తే ఈ భారం మరింత పెరిగిపోతుందని.. పాత పద్ధతినే అనుసరించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీంతో ఉత్తర్వులు వెలువడే వరకు అదనపు పెన్షన్ పీటముడి వీడేలా లేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బకాయిలపై మొండి వైఖరి...
చివరి 10 నెలల వేతన సగటు ఆధారంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ అందించే విధానం గతంలో అమల్లో ఉండేది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1998లో ఆ విధానానికి స్వస్తి పలికింది. ఉద్యోగుల చివరి నెల జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో తమకు అన్యాయం జరిగిందని, తమకు అందుతున్న పెన్షన్‌కు, కొత్త విధానంతో రావాల్సిన పెన్షన్‌కు వ్యత్యాసముందని 1998కు ముందు రిటైరైన ఉద్యోగులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రభుత్వం లెక్కచేయకపోవటంతో 2003లో హైకోర్టును ఆశ్రయించారు.
అప్పటికీ సర్కారు మొండికేయటంతో రిటైర్డ్ ఉద్యోగులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ వ్యత్యాసానికి సంబంధించిన బకాయిలు చెల్లించాలని.. ఇకపై కొత్త విధానంలోనే పెన్షన్ లెక్కించి ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ బకాయిల మొత్తం రూ. 900 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.
తెలంగాణ వాటాగా రూ. 327 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దాదాపు 30 వేల మంది లబ్ధి పొందుతారు. ఇప్పట్నుంచి వీరికి కొత్త విధానంలో పెన్షన్ చెల్లించటం వల్ల ప్రతి నెలా మరో రూ.10 కోట్లు భారం పడుతుందని సర్కారు భావిస్తోంది. ఆరు నెలలుగా ఈ ఫైలు సీఎం దగ్గరే పెండింగ్‌లో ఉంది.