సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే సహించేది లేదని పీఆర్‌టీయూ–టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు అవసరమైతే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ జరిగిన పీఆర్‌టీయూ 32వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు , నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) ఉపసంహరణ, ఉన్నత పాఠశాలల్లోని పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయించడం, పూర్తిస్థాయిలో హెల్త్‌కార్డుల అమలుకు కృషి చేయడం పీఆర్‌టీయూ ప్రాధాన్యాలని పేర్కొన్నారు.
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలంటూ ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని సమావేశం తీర్మానించింది.
రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సర్వీసు రూల్స్ రూపొందించి, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేసింది. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని పేర్కొంది. 11వ పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, 2018 జూలై 1 నుంచి అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరింది. ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేసింది. సమావేశంలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, ఏఐటీవో చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ అధ్యక్షుడిగా సరోత్తంరెడ్డి
పీఆర్‌టీయూ నూతన అధ్యక్షుడిగా పులి సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చెన్నకేశవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పీఆర్‌టీయూ రాష్ట కౌన్సిల్ సమావేశం అనంతరం నూతన కార్యవర్గం ఎన్నికకు నామినేషన్ స్వీకరించారు. ముందస్తు నిర్ణయం మేరకు ప్రస్తుత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న వారిద్దరూ మరో రెండేళ్లపాటు కొనసాగే నూతన కార్యవర్గం కోసం నామినేషన్ వేశారు. మిగతా వారెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం జరిగే సమావేశంలో వారు ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు తమ కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు.