
సర్వేమయం
- ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
- సమగ్ర సర్వేకు సిద్ధమైన జిల్లా యంత్రాంగం
- లెక్కించాల్సింది 10.66 లక్షల కుటుంబాలు
- విధుల్లో 42,850 మంది సిబ్బంది
- ఫారాలు భద్రపరిచేది ఇండోర్ స్టేడియంలో
- సెప్టెంబర్ 4నాటికి కంప్యూటరీకరణ పూర్తి
ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలతోపాటు వరంగల్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్న వారు సొంతూళ్లకు పయనమయ్యూరు. ఫలితంగా రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు జనసంద్రంగా మారారుు. అదేవిధంగా సమగ్ర సర్వే కోసం జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్యూమరేటర్లను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. పర్యవేక్షణకు అధికారులను నియమించింది.
హన్మకొండఅర్బన్ : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19వ తేదీన నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బస్టాండ్, పాన్‌షాప్, రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడ చూసినా.. ఎవరిని పలకరించినా.. సర్వే ము చ్చటే. కాగా, మరో 24 గంటల్లో జరుగనున్న సర్వే కోసం జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు ఉద్యోగు లకు శిక్షణ, సామగ్రి తరలింపు, వాహనాల ఏర్పాటు, ఇళ్లు, కుటుంబాల గుర్తింపును పూర్తిచేశారు. ఇదిలా ఉండగా, సర్వే సామగ్రిని ఇప్పటికే జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు తరలించారు.
10.66 లక్షల కుటుంబాల లెక్కింపు..
సర్వేను పురస్కరించుకుని అధికారులు ముందస్తు లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలుంటున్నాయ నే విషయాన్ని గుర్తించారు. కాగా, జిల్లాలో మొత్తం 10,66,175 కు టుంబాలున్నాయని అధికారుల ప్రాథమిక లెక్కల్లో తేలింది. అయితే పైన గుర్తించిన కుటుంబాల్లోని సభ్యుల వివరాలను మాత్రమే ఎన్యూమరేటర్లు సేకరించనున్నారు. ఇదిలా ఉండగా, సర్వే కోసం 42,850 మంది సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఒ క్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, సర్వేలో ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు, ఇంజినీరింగ్, ఇతర కళాశాలల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సేవలను కూడా వినియోగించుకోనున్నా రు. కాగా, అనుకోని పరిస్థితుల్లో ఎన్యూమరేటర్లు విధులకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయంగా మరొకరిని ఏర్పాటు చేసేందుకు శిక్షణ పొందిన 400 మంది అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
జిల్లాకు వచ్చిన 45వేల బుక్‌లెట్స్..
సర్వే ప్రొఫార్మాకు సంబంధించిన 45,888 బుక్‌లెట్స్ ఇప్పటికే జిల్లాకు వచ్చాయి. ఒక్కో బుక్ లెట్‌లో 30 కుటుంబాల వివరాలు నమోదు చేసేందుకు వీలుగా పేజీలు పొందుపరిచారు. కాగా, ఎన్యూమరేటర్లు మంగళవారం మండల కేంద్రాలకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వారిని అధికారులు ప్రత్యేక వాహనాల్లో విధులు నిర్వహించే ప్రాంతాలకు తరలిస్తారు. ఇదిలా ఉండగా, ఎన్యూమరేటర్లకు అధికారులు భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ కిషన్ ఇప్పటికే ఒక్కో మండలానికి రూ.1.50 లక్షలు విడుదల చేశారు.
ఇండోర్ స్డేడియంకు తరలింపు..
19వ తేదీన సర్వే పూర్తి అయిన అనంతరం ఎన్యూమరేటర్లు సర్వే పత్రాలను మండలంలోని అధికారులకు అందజేస్తారు. అయితే అదే రోజు రాత్రి అక్కడి నుంచి హన్మకొండ ఇండోర్ స్టేడియానికి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం 2100 కంప్యూటర్ల ద్వారా డాటా ఎంట్రీ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఈ ప్రక్రియ సెప్టెంబర్ 4వ తేదీ నాటిని పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో ఫారానికి రూ. 4 ఇవ్వనున్నారు.
పల్లెలకు పయనం..
సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలు అందుతాయని ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న వారు తమ సొంతూర్లకు బయలుదేరుతున్నారు. దీంతో రైళ్లు, బస్సు లు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి.
నేడు సెలవు.. గ్రీవెన్స్ రద్దు
సర్వేను పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటిం చినట్లు కలెక్టర్ కిషన్ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు, కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఏర్పాట్లు పూర్తి..
ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్వేలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియజేయాలి. ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబసభ్యులకు సంబంధించి తగిన రుజువులు చూపించాలి. సర్వేపై సందేహాలు ఉన్నవారు కలెక్టరేట్‌లోని టోల్ ఫ్రీ నంబర్ 18004252747కు ఫోన్ చేయొచ్చు., లేకుంటే కలెక్టర్ నంబర్ 9000114547కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించవచ్చు. ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం ఎలాంటి పారితోషికం ఇవ్వదు. కేవలం వాహన సౌకర్యం, భోజన సదుపాయం కల్పిస్తుంది. ఎన్యూమరేషన్ విధులకు ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా హాజరుకావాలి.
- సురేంద్రకరణ్, డీఆర్వో
700 మంది ఎన్యూమరేటర్లు కావాలి : డీఈఓ
విద్యారణ్యపురి : జిల్లాలో ఈనెల 19వ తేదీన చేపట్టనున్న సర్వే కోసం ఇంకా 700 మంది ఎన్యూమరేటర్లు కావాలని డీఈఓ విజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్‌లోని సీకేఎం, కేఎంసీ, గ్యాబ్రియల్ పాఠశాలల్లో ఆదివారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలో చేపట్టనున్న సర్వేకు 700మంది ఎన్యుమరేటర్లు అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు శిక్షణ తరగతులకు హాజరుకాని ప్రైవేటు ఉపాధ్యాయులు ఈనెల18వ తేదీన ఉదయం 10 గంటలకు హన్మకొండ డైట్ కళాశాలలో, దేశాయిపేటలోని నాగార్జున స్కూల్‌లో, గ్యాబ్రియల్ స్కూల్‌లో జరిగే శిక్షణకు తరలిరావాలని ఆయన కోరారు. ఎన్యూమరేటర్ విధుల్లో పాల్గొననున్న ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న సర్వే ఫారాలు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈనెల 18, 19న సెలవులు ప్రకటించామన్నారు. సర్వే విధులకు హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.