ఏరులై పారుతున్న మద్యం
- అక్రమంగా విక్రయాలు
- ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే?
ఆర్మూర్ (ఆర్మూర్ అర్బన్) : జిల్లాలో మద్యం అక్రమ సరఫరాను ఎక్సైజ్ అధికారులు నివారించలేకపోతున్నారు. మామూళ్లు స్వీకరించి చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలో ఆరు, పెర్కిట్‌లో మూడు, మా మిడిపల్లిలో నాలుగు, మచ్చర్ల, పిప్రి, ఆలూర్, అంకాపూర్‌లలో గ్రామానికి ఒకటి చొప్పున మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం లెసైన్స్ ఫీజు భారీగా పెంచేసింది. ప్రతి మద్యం దుకాణం సంవత్సరంలో లెసై న్స్ ఫీజుపై ఏడు రెట్ల మద్యం మాత్రమే ఐఎమ్‌ఎల్ డిపో నుంచి కొనుగోలు చేసి విక్రయించాలని నిబంధనలున్నాయి. పరిమితి దాటితే కొనుగోలుపై 13.5 శాతం ప్రివిలేజ్ ట్యాక్స్, ఒక శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
లెసైన్స్ ఫీజు భారీగా పెంచడంతో చాలా దుకాణాలకు టెండర్లే రాలేదు. దీంతో పలు చోట్ల ఎక్సైజ్ అధికారులు అంతకు ముందు మద్యం దుకాణాలను నడిపిన వారితో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని, అక్రమ మద్యం విక్రయాలకు అండగా ఉంటామని ప్రోత్సహించి వ్యాపారంలోకి దించారని ప్రచారం జరిగింది. లెసైన్స్ ఫీజు పెంచడం, ట్యాక్స్‌లు తడిసిమోపెడు అవుతుండడం తో పలువురు మద్యం వ్యాపారులు సైతం అక్రమ మార్గాలు పడుతున్నారు.
అధికారుల అండ కూడా ఉండడం వల్ల వ్యాపారులు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌తోపాటు పక్క రాష్ట్రాల నుంచి చౌకగా మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకువచ్చి వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మండలంలో వైన్ షాప్‌లు లేని గ్రామాల్లో తమ అనుచరుల ద్వారా బెల్ట్ షాప్‌లు నిర్వహిస్తూ అక్రమ మద్యం విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఎనిమిది నెలల క్రితం అంకాపూర్‌లో ఒక వైన్ షాప్‌నకు అక్రమంగా మ ద్యం తీసుకువచ్చిన లారీని ఎక్సైజ్ ఉన్నతాధికారులు ప ట్టుకున్న విషయం తెలిసిందే.
అవినీతి అధికారుల నిర్వాకం వల్ల ఆదాయానికి గం డి పడుతుండడంతో ప్రభుత్వం జూలైలో బార్ కోడ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ విధానంతో అక్రమ మద్యం అమ్మకాలకు చెక్ పడుతుందని ఆశించారు. బార్ కోడ్ విధానాన్ని అమలు చేయడానికి ప్రతి వైన్ షాప్‌నకు ఒక కంప్యూటర్ అవసరమవుతుంది. వైన్సులకు కంప్యూటర ను సరఫరా చేయడానికి ఒక ప్రైవేటు ఏజేన్సీ ప్రభుత్వం నుంచి టెండరును దక్కించుకుంది. బహిరంగ మార్కెట్‌లో రూ. 60 వేలకు లభిస్తున్న కంప్యూటర్, బార్ కోడ్ యంత్రాలను ప్రైవేటు ఏజెన్సీ భారీ ధరకు విక్రయిస్తుండడంతో వాటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో బార్ కోడ్ విధానం అమలు కావడం లేదు.
మా దృష్టికి రాలేదు
జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాం. రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు కొనసాగిస్తున్నాం. జిల్లాలో మద్యం అక్రమ అమ్మకాల విషయం మా దృష్టికి రాలేదు. వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం.
-లక్ష్మణ్ సింగ్, సీఐ, ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ