సాక్షి, హైదరాబాద్: అవిభాజ్య మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన ‘పాలమూరు–రంగారెడ్డి’ఎత్తిపోతల పథకంపై వచ్చిన ఫిర్యాదులపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు పీఎంవో డైరెక్టర్ నందిని పలివాల్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్‌కు లేఖ రాశారు. ఆగస్టులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై పలు ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ప్రాజెక్టు టెండర్లలో అవకతవకల అంశాన్ని ప్రస్తావించారు. నాగం లేఖలోని అంశాలపై వివరణ ఇవ్వాలని పీఎంవో లేఖలో స్పష్టం చేసింది. దీనిపై నివేదిక పీఎంవోకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ నివేదికను రూపొందించింది.
ఆరోపణల్లో నిజం లేదు..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రాజెక్టు టెండర్లలో అవకతవకలు, అక్రమాలు జరగలేదని, నాగం ఆరోపణలన్నీ నిరాధారమని నీటిపారుదల శాఖ తన నివేదికలో స్పష్టం చేసినట్లుగా తెలిసింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పంప్‌హౌస్‌లలో బీహెచ్‌ఈఎల్‌కు ఎలాంటి అనుభవం లేకున్నా పంపుల నిర్మాణ పనులు అప్పగించారని నాగం ఆరోపించారు. దీనిపై శాఖ వివరణ ఇస్తూ.. ‘ప్రభుత్వంతో బీహెచ్‌ఈఎల్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. పంపులు, మోటార్ల తయారీ, సరఫరా, పర్యవేక్షణతోపాటు వాటిని బిగించడం బీహెచ్‌ఈఎల్ చేయాలి. నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం 4 గీ130 మెగావాట్ల టర్బైన్‌లను బీహెచ్‌ఈఎల్ తయారు చేసింది.
326 మీటర్ల నుంచి 44.13 క్యూసెక్కుల నీటిని డిశ్చార్జి చేసేలా వాటిని తయారు చేసింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అన్ని పరిశీలించాక కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీఓటీ) అథారిటీ సమ్మతం తెలిపింది. ఈ దృష్ట్యా బీహెచ్‌ఈఎల్‌పై నాగం చేస్తున్న ఆరోపణలు నిరాధారం’అని పేర్కొన్నట్లుగా తెలిసింది. టెండర్ల విషయమై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయగా కొట్టివేసిందని పీఎంవో దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. నాగం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని సైతం ఆశ్రయించారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన విజిలెన్స్ ఆయన ఆరోపణల్లో నిజం లేదని తేల్చిందని వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ నివేదికను.. ఒకట్రెండు రోజుల్లో పీఎంవోకు పంపనుంది.
‘పాలమూరు’పై పీఎంవో ఆరా!
Published Tue, Dec 5 2017 2:16 AM | Last Updated on Tue, Dec 5 2017 2:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment