కారాగరం @ కర్మగారం
పని ఉపాధి
జిల్లా కారాగారం కర్మాగారంగా మారింది. వివిధ కేసుల్లో శిక్ష పడి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు తమ సృజనకు పదును పెడుతూ పలు రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. చేతినిండా సంపాదిస్తున్నారు. ఆర్థికంగా బలపడుతున్నారు. బయటకొచ్చిన తర్వాత కష్టపడి బతకగలమని భరోసా నింపుకుంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.11 లక్షల విలువైన వస్తువులు తయారు చేసి భేష్ అనిపించుకున్నారు.
- కరీంనగర్ క్రైం
* జిల్లా జైలులో బెంచీలు, మంచాలు, కుర్చీలు తయారు చేస్తున్న ఖైదీలు
* రూ.11 లక్షల విలువైన వస్తువుల విక్రయం
* కారాగారంలో క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు
కరీంనగర్‌లోని జిల్లా జైలు క్రమ‘శిక్ష’ణాలయంగా మారింది. జైలు సూపరింటెండెంట్ వచ్చిరాగానే ఖైదీలకు ఆర్థిక స్వావలంబన చేకూరాలని తలిచారు. సుమారు రూ. 11 లక్షలు వెచ్చించి బెంచీలు, కుర్చిలు తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పారు. నైపుణ్యంగల ఖైదీలను గుర్తించి పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో ఉపయోగించే బెంచిలు, టేబుళ్లు, మంచాల తయారీ పనికల్పించారు.
తయారు చేసిన సామగ్రిని కలెక్టర్ సహా కాలేజీ యాజమాన్యాలకు చూపించారు. నాణ్యత పరిశీలించిన కలెక్టర్ రూ.30 లక్షల విలువైన పనిని జైలుకు అప్పగించారు. వీటితో పాటు జైలు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మరో రూ.14 లక్షల వ రకు ఆర్డర్లు తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు సుమారు రూ. 11 లక్షల విలువైన 300 టేబుళ్లు, కూర్చీలు, మంచాలు విక్రయించారు.
ఖైదీలకు వేతనం..
కర్మాగారంలో సుమారు 10 మంది ఖైదీలు పనిచేస్తున్నారు. ఇందులో ప్రతిభగల వారిని గుర్తించి రోజుకు రూ. 50, అన్‌స్కిల్డ్ ఖైదీలకు రూ. 30 చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ఖైదీలకు వేతనంగా రూ. 1.10 లక్షలు అందించారు. 2015-16లో రూ.11 లక్షల వస్తువులు విక్రయించి ఖర్చులు పోను రూ. 2.35 లక్షలు ఆర్జించారు. ఖైదీలకు వేతనంగా అందించిన డబ్బులు పోను మరో రూ. 1.20 లక్షల వరకు జైలు ఖాతాలో జమ చేశారు. వచ్చిన ఆదాయంతో మరింత మంది ఖైదీలకు పనికల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది మరిన్ని ఆర్డర్లు పొంది ప్రణాళికులు రూపొందిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న వారికి రోజుకు రూ. 70 చొప్పున చెల్లిస్తున్నారు.
క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు..
ఖైదీలకు ఇష్టమైన భోజనం అందించడానికి వీలుగా జైలులోనే ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం ఇడ్లీ, దోష, పూరి టిఫిన్లు, చికెన్, ఎగ్ బిర్యానీలు, ఎగ్‌ఫ్రైడ్, చికెన్‌ఫ్రైడ్‌రైస్, ఎగ్‌బొండా, చపాతి తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో దానికి ఒక్కో రేట్‌కు విక్రయించనున్నారు. అయితే ఈ విధానం ఇప్పటికే విదేశాల్లో అమల్లో ఉంది. అయితే మన రాష్ట్రం విషయానికొస్తే కరీంనగర్‌లో ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు ఇటీవలే ట్రయల్ నిర్వహించారు.
విజయవంతం కావడంతో జైళ్లశాఖ డీసీ వీకేసింగ్ దీనిని రాష్ట్రవ్యాస్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదంతా అమలులోకి వస్తే జిల్లా కేంద్ర కారాగారంలో క్యాంటీన్‌కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వచ్చే ఆదాయం అటు ఖైదీలకు వెచ్చించడంతోపాటు మరో 20 శాతం జైలు అభివృద్ధికి కేటాయించనున్నారు.
సంక్షేమమే లక్ష్యం..
ఖైదీల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆర్థికాభివృద్ధితో పాటు ఖైదీల్లో మార్పు తెచ్చి నేరాల సంఖ్య తగ్గించడానికి కృషిచేస్తున్నాం. శిక్షకాలంలో వారిలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి మంచి మార్గం చూపెట్టి మంచి మార్గంలో నడిచేలా చూస్తున్నాం. విడుదలైన తర్వాత తవు కాళ్లమీద తాము నిలబడేలా వివిధ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నాం. రానున్న కాలంలో మరిన్ని ఉపాధి కార్యక్రమాలు చేపడుతాం. క్యాంటీన్ నిర్వహించడానికి డీజీ ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో అమలుకు చర్యలు తీసుకుంటాం.
- శివకుమార్, జిల్లా జైలు సూపరింటెండెంట్