బాధ్యతలు స్వీకరించిన ప్రీతమ్‌కు అభినందనలు తెలుపుతున్న కుంతియా. చిత్రంలో రేవంత్‌రెడ్డి, షబ్బీర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశంలో ఏ వర్గానికి చెందిన ప్రజలూ భయపడుతూ బతకలేదని, ఆరేళ్ల బీజేపీ పాలనలో మాత్రం లక్షలాది మంది భయంతో బతికే పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ శాసన సభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. సెక్యులర్ భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజలు రోడ్ల మీదకు వస్తే సరిపోదని, ప్రజల గొంతుక వినిపించే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఉండాలని ఆయన అన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన నాగరిగారి ప్రీతమ్ మంగళవారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భట్టి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితులు ఆత్మగౌరవంతో బతికారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన రిజర్వేషన్ల కారణంగా ఆయా వర్గాలు చైతన్యవంతులయ్యారని, ఎస్సీ విభాగం బలోపేతం అయితేనే కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అన్నారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన రిజర్వేషన్లకు ఇప్పుడు ప్రమాదం ఏర్పడిందని, కేంద్రంలోని బీజేపీ వైఖరి కారణంగా రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పోరాటం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, ఏఐసీసీ కార్యదర్శులు ఎస్.సంపత్‌కుమార్, మధుయాష్కీగౌడ్, పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రీతమ్‌కు తన అభినందన సందేశం పంపారు.
Comments
Please login to add a commentAdd a comment