
సాక్షి, మేడ్చల్: భారతదేశం అంతటా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడంలో తలమునకలవుతుంది. దేశ ప్రథమ పౌరుడు సైతం జెండా ఎగురవేసి నమస్కరిస్తారు. ఇక పాఠశాల పిల్లలు ఒకరోజు ముందునుంచే హడావుడి చేస్తూ రిపబ్లిక్‌డే కోసం సిద్ధమవుతుంటారు. అయితే మేడ్చల్‌లోని అత్వెల్లి గ్రామంలో హైటెక్ వ్యాలీ అనే ప్రైవేటు పాఠశాల మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఆదివారంనాడు స్కూలుకు సెలవు ప్రకటించింది. కానీ ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మాత్రం ఆదివారం స్కూలుకు వచ్చి విద్యార్థులు లేకుండానే జాతీయ జెండాను ఎగురవేశాడు. ఇక ఈ ఘటననపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లలకు రిపబ్లిక్ డే వంటివి ఎంతగానో తోడ్పడుతాయని అభిప్రాయపడ్డారు. దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే వేడుకలను పిల్లల నుంచి దూరం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.