ఆన్‌లైన్‌లో ‘పంచాయతీ’ | priya software for panchayat development | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ‘పంచాయతీ’

Published Fri, Jul 18 2014 1:39 AM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM

priya software for panchayat development

సాక్షి, మంచిర్యాల :  గ్రామ పంచాయతీలను గాడిలో పెట్టేందుకు తెలంగాణ సర్కారు క్రియాశీల కార్యాచరణ రూపొందించింది. ఆన్‌లైన్ ద్వారా పంచాయతీలను ఇంటర్నెట్‌తో అనుసంధానించి వన్‌స్టాప్ సర్వీస్ సెంటర్లుగా తీర్చిదిద్దే కసరత్తు సాగుతోంది. ఆయా గ్రామ పంచాయతీలలో కొత్త సేవలను ప్రవేశపెట్టడంతోపాటు ఆదాయ, వ్యయాలను సమీక్షించేందుకు రంగం సిద్ధం చేసింది.

తాజాగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారాకరామారావు గ్రామ పంచాయతీల ఆన్‌లైన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించడంతో ఈ ప్రక్రియ ఊపందుకుంది. పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అకౌంటింగ్(ప్రియా) సాఫ్ట్‌వేర్‌తో 2011-12 నుంచి తాజా ఏడాది వరకు జరిగిన లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ప్ర భుత్వం ఆదేశించింది. ఇటీవలి కాలం వరకు మందకొడిగా సాగిన ఈ ప్రక్రియ తాజాగా మంత్రి సమీక్ష నేపథ్యంలో వేగం అందుకుంది.

 పంచాయతీల ఆన్‌లైన్ ప్రక్రియ జిల్లాలో మూడు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలోని 866 గ్రామపంచాయతీలను 580 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్‌లో జనాభా, కనెక్టివిటీ ఆధారంగా 2 లేదా 3 గ్రామపంచాయతీలు ఉంటాయి. 580 క్లస్టర్లకు గాను 145 క్లస్టర్లకే కంప్యూటర్లు అందజేశారు. మండలానికి ఒకటి చొప్పున 52 మండలాలకు, మిగతావి క్లస్టర్ గ్రామపంచాయతీలకు అందజేశారు. దీంతోపాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఒకటి, డీపీవో కార్యాలయంలో ఒకటి, ముగ్గురు డీఎల్పీవోలకు ఒకటి చొప్పున మరో మూడు కంప్యూటర్లు ఆన్‌లైన్‌తో అనుసంధాన వివరాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేశారు.

 విధులు, నిధులన్నీ..
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధుల వివరాలన్నీ ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించింది. కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల నిధులు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నిధులు, బీఆర్‌జీఎఫ్, ఎంపీ లాడ్స్, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఆర్‌డబ్ల్యూఎస్ నిధులు, పైకా, వృద్ధాప్య నిధులు, పారిశుధ్య నిధులు, గ్రామ పంచాయతీకి వచ్చిన ఇతర ఆదాయాలు వంటివన్నీ పొందుపర్చాల్సి ఉంటుంది.

 ఈ విధంగా పాత వివరాలన్నీ అప్‌డేట్ చేస్తేనే కొత్తవి మంజూరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఉద్యోగులు, ఆపరే టర్లు ఈ పనుల్లో కుస్తీ పడుతున్నారు. మరోవైపు పూర్తిస్థాయి ఆన్‌లైన్ చేయడం వల్ల అవినీతి తగ్గే అవకాశం ఉంది. ప్రతీ పైసా కేటాయింపు, ఖర్చు చేయడానికి లెక్క ఉండడంతో జ వాబుదారీతనం పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించి తెలంగాణ పేరుతో తెచ్చేందుకు సంబంధిత శాఖ ఇప్పటికే చర ్యలు ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement