సమస్యలు..సవాళ్లు ఉన్నాయి..
-
పోలీసు సిబ్బంది కొరత ఉంది
-
మావోయిస్టు కార్యకలాపాలు తగ్గినా.. అప్రమత్తమే
-
సైబర్‌క్రైం, వైట్‌కాలర్ నేరాలు.. అత్యాచారాలు పెరుగుతున్నాయి
-
{పపంచంలోనే ప్రతిష్ట కలిగిన పోలీసు వ్యవస్థగా తీర్చిదిద్దుతా..
-
సమష్టి కృషితో అధిగమిస్తాం ‘సాక్షి’తో తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు, నేరాల పరంగా పలు సమస్యలున్నాయని, వాటిని పోలీసుశాఖ సమష్టికృషితో అధిగమిస్తామని తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ శర్మ చెప్పారు. సోమవారం డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రాల విభజనతో తెలంగాణకు పోలీసు సిబ్బంది కొరత ఏర్పడిన మాట నిజమేనని, అయితే మున్ముందు రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ ఖాళీలను పూరిస్తామని అన్నారు.
రాష్ట్రానికి మావోయిస్టుల పరంగా ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు లేనప్పటికీ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్, మహారాష్ర్టల్లో నక్సల్స్ కదలికలపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా రాష్ట్ర పోలీసులు ఉండాల్సిందేనని అనురాగ్‌శర్మ చెప్పారు. అలాగే, హైదరాబాద్.. సైబరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఐఎస్‌ఐ, దాని ప్రేరిత ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగు చూసినప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ వస్తున్నామన్నారు.
అయితే, దీనిపై మరింతగా కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్‌క్రైం, వైట్‌కాలర్ నేరాలు, మహిళలపై అత్యాచారాల వంటి నేరాల సంఖ్య పెరుగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ర్ట విభజన జరగక పూర్వం ఇలాంటి నేరాలను అరికట్టడానికి సీఐడీ వంటి ప్రత్యేక పోలీసు విభాగంలో తగినంత మంది అధికారులు.. సిబ్బంది ఉండేవారని.. ఇప్పుడు సిబ్బంది, అధికారుల కొరత ఏర్పడిందన్నారు.
ఈ సమస్యపై దృష్టిసారించి ఉన్న అధికారులు, సిబ్బందితో ఇలాంటి నేరాల అదుపునకు వృత్తి నైపుణ్యం గల వారిని ఎంపిక చేసుకొని, సీఐడీ విభాగాన్ని పటిష్టపరుస్తామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో అన్ని సమస్యలను అధిగమిస్తామని, సమష్టి కృషితో రాష్ట్ర పోలీసుల ప్రతిష్టను ఇనుమడింపజేస్తామని పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయిలో పేరు ప్రతిష్టలు గడించేలా పోలీసుశాఖకు మెరుగులు దిద్దుతామన్నారు. పోలీసు శాఖ రెండు రాష్ట్రాలకు విభజించినప్పటికీ... నేరాల అదుపులో కలిసి పని చేస్తామని చెప్పారు. వ్యవస్థీకృతంగా అవసరమైన మార్పులు.. చేర్పులు చేస్తామని, తెలంగాణలో కొత్త పోలీసు కమిషనరేట్‌ల ఏర్పాటునకు కూడా తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరించారు. అలాగే, పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడం కూడా తన లక్ష్యంగా అనురాగ్‌శర్మ వివరించారు.