‘పాఠశాలల మూసివేత ఆపాలి.. లేకుంటే’
కూసుమంచి(ఖమ్మం): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపకుంటే పోరాటాలు కొనసాగిస్తామని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేపట్టింది. దీంట్లో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని దుబ్బతండా, ఎర్రగడ్డ, కొత్తూరు, గ్రామాలను బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడి పాఠశాలల మూసివేతకు గల కారణాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూసుమంచి ఉన్నత పాఠశాలలో హరగోపాల్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5 వేల పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేసిందన్నారు. తమ కమిటీ వత్తిడి మేరకు ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేసినా.. ప్రస్తుతం 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలను మూసివేస్తోందన్నారు. అటువంటి పాఠశాలలను మూసివేస్తే పేద పిల్లల పరిస్థితి ఏమటని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల మూసివేతను వెంటనే ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.