pro.haragopal
-
హింసపై మావోయిస్టులు పునరాలోచించాలి
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకులో ఆదివారం జరిగిన హింసపై మావోయిస్టు పార్టీ పునరాలోచించుకోవాలని సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్.హరగోపాల్ సోమవారం సూచించారు. హింస ద్వారా వ్యవస్థలు మారవని, ప్రజల భాగస్వామ్యం, చైతన్యంతో కూడిన పోరాటాల ద్వారానే మార్పు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వ్యక్తుల నిర్మూలన ప్రజల్ని.. హింస–ప్రతిహింసా వలయంలోకి నెడుతుందని హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య, మానవీయ విలువల ఆధారంగానే ఉద్యమాలు ఉండాలని అభిలాషించారు. మనుషుల ప్రాణాలను తీయడం మార్పునకు ఎంతవరకు దోహదపడుతుందో ఉద్యమకారులు ఆలోచించాలని చెప్పారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఖనిజ వనరులను జాతీయం చేసి, ఆ సంపదను సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. -
‘పాఠశాలల మూసివేత ఆపాలి.. లేకుంటే’
కూసుమంచి(ఖమ్మం): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపకుంటే పోరాటాలు కొనసాగిస్తామని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేపట్టింది. దీంట్లో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని దుబ్బతండా, ఎర్రగడ్డ, కొత్తూరు, గ్రామాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పాఠశాలల మూసివేతకు గల కారణాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూసుమంచి ఉన్నత పాఠశాలలో హరగోపాల్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5 వేల పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేసిందన్నారు. తమ కమిటీ వత్తిడి మేరకు ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేసినా.. ప్రస్తుతం 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలను మూసివేస్తోందన్నారు. అటువంటి పాఠశాలలను మూసివేస్తే పేద పిల్లల పరిస్థితి ఏమటని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల మూసివేతను వెంటనే ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు మధు
వరంగల్ : వరంగల్ జిల్లా ముప్పానపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులుపై ఏటూరు నాగారం దళ కమాండర్ మావోయిస్టు మధు కాల్పులకు యత్నించాడు. దీంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో నిన్న రాత్రి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మరోవైపు మావోయిస్టు మధు అరెస్ట్ పై మానవ హక్కుల వేదిక నేత ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. మధును పోలీసులు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని, అతడిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.