
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకులో ఆదివారం జరిగిన హింసపై మావోయిస్టు పార్టీ పునరాలోచించుకోవాలని సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్.హరగోపాల్ సోమవారం సూచించారు. హింస ద్వారా వ్యవస్థలు మారవని, ప్రజల భాగస్వామ్యం, చైతన్యంతో కూడిన పోరాటాల ద్వారానే మార్పు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వ్యక్తుల నిర్మూలన ప్రజల్ని.. హింస–ప్రతిహింసా వలయంలోకి నెడుతుందని హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య, మానవీయ విలువల ఆధారంగానే ఉద్యమాలు ఉండాలని అభిలాషించారు. మనుషుల ప్రాణాలను తీయడం మార్పునకు ఎంతవరకు దోహదపడుతుందో ఉద్యమకారులు ఆలోచించాలని చెప్పారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఖనిజ వనరులను జాతీయం చేసి, ఆ సంపదను సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment