తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను టీజేఎస్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ కోదండరాం బుధవారం పరామర్శించారు. లివర్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సుధాకర్ ఆరోగ్య వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం కలిసి పని చేశామన్నారు. మహాకూటమిలో ఒక సీటు వెనక్కి తీసుకున్నప్పటికీ, సుధాకర్ కూటమి విజయాన్ని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. మహాకూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని సుధాకర్ తనకు మాట ఇచ్చారని.. దేవుడి దయ వల్ల త్వరగా కోలుకుని మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానన్నారు.
కాగా తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు కేటాయిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పెద్దలు మాట తప్పారని ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు కూడా. ఇందులో భాగంగానే 21మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ చెరుకు సుధాకర్ గత బుధవారం విడుదల చేశారు. అంతేకాకుండా తమ పార్టీ తరపున మొత్తం 52 మందిని బరిలోకి దింపుతామని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తాను మహాకూటమికి వ్యతిరేకం కాదని, త్వరలోనే మహాకూటమి తరఫున ప్రచారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment