నేరడ టు జీహెచ్‌ఎంసీ | profile to bonthu ram mohan | Sakshi
Sakshi News home page

నేరడ టు జీహెచ్‌ఎంసీ

Published Thu, Feb 11 2016 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

నేరడ టు  జీహెచ్‌ఎంసీ

నేరడ టు జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్ మేయర్‌గా కురవి మండల వాసి
రామ్మోహన్ ఎంపికపై జిల్లాలో హర్షాతిరేకాలు

 
మహబూబాబాద్ : ఎందరో ఉద్యమకారులకు జన్మనిచ్చిన వరంగల్ జిల్లా గడ్డపై పుట్టిన మరొకరు ఉన్నత పదవి చేపట్టనున్నారు. జిల్లాలోని కురవి మండలం నేరడలో జన్మించిన బొంతు రామ్మోహన్  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) మేయర్‌గా ఎంపికయ్యారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తి కాగా, బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చర్లపల్లి కార్పొరేటర్‌గా గెలిచిన బొంతు రామ్మోహన్‌ను మేయర్‌గా ఎంపిక చేశారు. రాష్ర్ట రాజధాని అయిన హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్‌గా జిల్లా వాసి ఎంపిక కావడంపై కురవి, మహబూబాబాద్ మండలాలతో పాటు జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బొంతు రామ్మోహన్ కార్పొరేటర్‌గా పోటీ చేసిన చర్లపల్లి డివిజన్‌లో వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ - నర్సింగరావుతో పాటు టీఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రచారం చేయడం విశేషం.
 
ఇదీ నేపథ్యం..

 కురవి మండలం నేరడకు చెందిన వెంకటయ్య, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఏకైక కుమారుడు రామ్మోహన్. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆమనగల్‌లో చదువుకున్న ఆయన ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు కురవి మండలం నేరడలో పూర్తి చేశారు. ఆ తర్వాత మానుకోటలోని కంకరబోడ్ హైస్కూల్‌లో 9వ తరగతి, ఎస్సెస్సీ, జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఇక జిల్లా కేంద్రంలోని ఆదర్శ కళాశాలలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ చదివిన రామ్మోహన్, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన జంగాల శ్రీదేవిని వివాహం చేసుకున్న రామ్మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
తొలుత ఏబీవీపీలో..
తొలుత ఏబీవీపీలో పనిచేసిన బొంతు రామ్మోహన్ 2002లో టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా, పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయన క్రియాశీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్‌గా ఎన్నిక కాగా, పార్టీకి చేసిన సేవలను గుర్తించి మేయర్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ విషయం తెలియగానే అటు కురవి, ఇటు మానుకోట మండలాలతో పాటు జిల్లావ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు చదువుకున్న వారు, టీఆర్‌ఎస్ నాయకులు పలువురు రామ్మోహన్ ఎంపికపై హర్షించారు. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి మాట్లాడుతూ రామ్మోహన్‌తో కలిసి తాను ఉస్మానియాలో పీజీ చదువుకున్నానని గుర్తు చేశారు. చదువుకునే సమయంలో విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేవారని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం అశోక్, నాయకులు భూక్యా ప్రవీణ్, మార్నేని కిరణ్, తదితరులు కూడా ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, మానుకోట పట్టణంలో గురువారం సంబరాలు జరుపుకునేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement