
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఇయర్ ఎండ్ ట్రీట్ ఇచ్చారు. 2007 బ్యాచ్‌కు చెందిన డైరెక్టర్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు, కొంత మంది ర్యాంకర్లకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జోన్, హైదరాబాద్ జోన్ కలిపి రాష్ట్రవ్యాప్తంగా 410 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి లభించింది. వీరిలో అధికంగా 2007 బ్యాచ్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్లుండగా, వరంగల్ జోన్‌లోని 2009 బ్యాచ్‌కు చెందిన కొంత మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు సైతం ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందారు.
వరంగల్ జోన్‌లో 162 మందికి, హైదరాబాద్ జోన్‌లో 248 మందికి పదోన్నతులు లభించాయి. కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించాలని ఉన్నతాధికారులు భావించారు. అయితే కొంతమంది ఏఆర్, స్పెషల్ పోలీస్ నుంచి సివిల్‌లోకి కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు హైకోర్టుకెళ్లి సీనియారిటీపై స్టే తీసుకువచ్చారు. దీంతో పదోన్నతులకు అంతరాయం ఏర్పడినట్లైంది. అయితే సీనియారిటీ జాబితాపై హైకోర్టుకు నివేదికిచ్చిన తర్వాత పదోన్నతుల ప్రక్రియను చేపడతామని ఉన్నతాధికారులు తెలిపారు.